
India-Mongolia: మంగోలియా అభివృద్ధిలో భారత్ నమ్మకమైన భాగస్వామి: మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
మంగోలియా దేశ ప్రగతిలో భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి వచ్చిన మంగోలియా అధ్యక్షుడు ఖురెల్‌సుఖ్ ఉఖ్నా (Khurelsukh Ukhnaa)తో ప్రధాని మోదీ సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉఖ్నా భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ మాట్లాడుతూ - "భారత్, మంగోలియా సంబంధాలు కేవలం రాజకీయ లేదా ఆర్థిక పరిధిలోనే కాకుండా ఆధ్యాత్మిక బంధంతో కూడుకున్నవి. ఇరుదేశాల మధ్య ఉన్న అనుబంధం ప్రజల హృదయాలలో ప్రతిబింబిస్తోంది" అని పేర్కొన్నారు.
వివరాలు
మంగోలియాలో భారత్ చేపట్టిన 170 కోట్ల డాలర్ల చమురు శుద్ధి ప్రాజెక్టు
భారత్ అందించిన 1.7 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయంతో మంగోలియాలో నిర్మాణం జరుగుతున్న చమురు శుద్ధి కర్మాగారం ప్రాజెక్టు ఆ దేశ ఇంధన భద్రతను మరింత బలపరుస్తుందని చెప్పారు. ఇది విదేశాల్లో భారత్ చేపట్టిన అతిపెద్ద అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్టుగా నిలిచిందని వివరించారు. ఈ ప్రాజెక్టులో మంగోలియా సిబ్బందితో పాటు 2,500 మందికిపైగా భారత నిపుణులు పనిచేస్తున్నారని అని మోదీ చెప్పారు. అదేవిధంగా ఇరుదేశాలు అనేక అంతర్జాతీయ వేదికలలో కలిసి పనిచేస్తున్నాయని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుతం, సులభతరం, సమగ్ర వాణిజ్యానికి కృషి చేస్తున్నాయని చెప్పారు. అలాగే గ్లోబల్ సౌత్ దేశాల స్వరాన్ని బలంగా వినిపిస్తున్నామని, త్వరలో మంగోలియా పౌరులకు ఉచిత ఈ-వీసా సదుపాయం అందిస్తామని ప్రకటించారు.
వివరాలు
పలు రంగాల్లో పరస్పర సహకారం
ఈ సందర్భంగా అధ్యక్షుడు ఉఖ్నా మాట్లాడుతూ, "స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ చూపిస్తున్న నాయకత్వం విశేషం.అంతర్జాతీయ సౌర కూటమిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది" అని ప్రశంసించారు. దీనికి ప్రతిస్పందించిన మోదీ, "బౌద్ధమతం ద్వారా ఇరుదేశాలు సహజంగా ఆధ్యాత్మిక సోదరదేశాలుగా మిళితమయ్యాయి. గౌతమ బుద్ధుడి ప్రధాన శిష్యులైన సరిపుత్ర,మౌద్గల్యయానుల పవిత్ర అవశేషాలను వచ్చే ఏడాది మంగోలియాకు అందజేస్తాం" అని తెలిపారు. అలాగే, గందన్ బౌద్ధ మఠానికి భారత్ త్వరలో ఒక సాంస్కృతిక ఉపాధ్యాయుడిని పంపి,అక్కడి ప్రాచీన బౌద్ధ ప్రతులను అధ్యయనం చేయించే ప్రణాళిక ఉందన్నారు. బిహార్‌లోని పురాతన నలంద విశ్వవిద్యాలయం మంగోలియాలో బౌద్ధమతం వ్యాప్తికి ఒకప్పుడు విశేష పాత్ర పోషించిందని, అదే అనుబంధాన్ని గందన్ మఠం-నలంద యూనివర్శిటీల మధ్య మరింత బలపరుస్తామని తెలిపారు.
వివరాలు
సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేయడానికి అవగాహన ఒప్పందం
లద్దాఖ్ స్వయంప్రతిపత్తి పర్వతప్రాంత అభివృద్ధి మండలి, మంగోలియాలోని అర్ఖాంగాయ్ ప్రావిన్స్ మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక అవగాహన ఒప్పందం కుదిరిందని మోదీ చెప్పారు. అలాగే రక్షణ, భద్రత, ఇంధనం, గనులు, ఐటి, విద్య, ఆరోగ్యం, సంస్కృతి వంటి పలు రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యం మరింత విస్తరించిందని వివరించారు. 1955లో భారత్-మంగోలియా మధ్య దౌత్య సంబంధాలు స్థాపించబడ్డాయని మోదీ గుర్తుచేశారు.