PM Modi: ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ
ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసారు. త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తొలుత మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. సమ్మక్క-సారలమ్మ, యాదాద్రి నరసింహుడికి నమస్కారం అంటూ ప్రంసంగాన్ని మొదలు పెట్టారు. దేశంలో బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా ఉన్నట్లు మోదీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా విశ్వరూప మహాసభకు వచ్చిన తన బంధువులకు అభినందనలు అంటూ పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వాలు మాదిగలను మోసం చేశాయి: మోదీ
స్వాతంత్ర్య భారతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయని, కానీ బీజేపీ మాత్రమే సామాజిక న్యాయాన్ని అమలు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వాలు మాదిగలను మోసం చేసినట్లు మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేసిన పాపాలను ప్రక్షాళన చేయడానికే తాను వచ్చినట్లు చెప్పారు. మందకృష్ణ మాదిక గత 30 ఏళ్లుగా ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యమిస్తున్నారన్నారు. మందకృష్ణ పోరాటానికి మేము కచ్చితంగా అండగా ఉంటామని స్పష్టం చేసారు. అంతేకాదు, మాదిగల పోరాటానికి సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు ప్రకటించారు. మాదిగ హక్కులను సాధించే వరకు మందకృష్ణ మాదిగకు అండగా ఉంటామని మోదీ స్పష్టం చేశారు.
దళితబంధు అనేది బీఆర్‌ఎస్ నేతల బంధువులకే: మోదీ
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా ఇక్కడి మాదిగల్ని మోసం చేస్తోందన్నారు. దళితులను సీఎం చేస్తానని చెప్పి, కేసీఆర్ మోసం చేశారన్నారు. 2014లో తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వం.. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైనట్లు వివరించారు. దళతబంధుపై కూడా మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దళితబంధు అనేది బీఆర్‌ఎస్ నేతల బంధువుల పథకంగా మారినట్లు చెప్పారు. కేవలం బీఆర్ఎస్ నేతలకు ఇచ్చి, చేతులు దులుపుకుంటున్నట్లు మోదీ పేర్కొన్నారు. అంతేకాదు, కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడెకరాలు, రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు గుర్తుచేసారు. కేసీఆర్ ప్రభుత్వం ఇరిగేషన్ పేరుతో కుంభకోణం చేసిందన్నారు.
అంబేద్కర్ విధానాలకు కాంగ్రెస్ తూట్లు: మోదీ
అంబేద్కర్ విధానాలకు కాంగ్రెస్ తూట్లు పొడిచినట్లు మోదీ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పట్ల దలితులు జాగ్రత్తగా ఉండాలన్నారు. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా తాము నిలబెడితే, కాంగ్రెస్ ఓడించే ప్రయత్నం చేసిందన్నారు. అంతేకాదు, ఆదివాసీ అయిన ముర్ము కూడా కాంగ్రెస్ ఓడించాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్‌కు భారత రత్న ఇచ్చిన ఘనత బీజేపీతే అన్నారు. కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా, అంబేద్కర్‌ను ఎన్నికల్లో గెలవకుండా చేసింది కాంగ్రెస్ చేసిందన్నారు. అణగారిన వర్గాలకు, బీసీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు.