PM Modi Tirupati Visit: ప్రధాని మోడీ ఏపి పర్యటన...మూడు రోజులు తిరుపతిలోనే బస
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి మరో కీలక జాతీయ స్థాయి సమావేశానికి వేదిక కానుంది. 61వ అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 4న రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఆయన తిరుపతిలోనే బస చేస్తారు. తిరుపతి శివార్లలోని యెర్రపాడులో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్) ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుంది. డిసెంబర్ 4న సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీకి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఐసర్ క్యాంపస్‌కు చేరుకుంటారు.
Details
దేశ భద్రతపై కీలక చర్చలు
ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కూడా హాజరుకానున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 200 మంది ఐపీఎస్ అధికారులు ఇందులో పాల్గొంటారు. డిసెంబర్ 5న పూర్తిస్థాయిలో, 6న మధ్యాహ్నం వరకు ప్రధాని సమావేశాల్లో ఉంటారు.
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు వంటి సవాళ్లపై అధికారులు చర్చించనున్నారు.
మారుతున్న నేర పద్ధతులను ఎదుర్కోవడంలో పోలీసు వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దే మార్గాలపైనా దృష్టి పెట్టనున్నారు.
Details
పోలీసింగ్‌లో ఏఐ.. చివరిరోజు శ్రీవారి దర్శనం
పోలీసు శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కూడా ఈసారి సదస్సులో ప్రధాన చర్చనీయాంశంగా ఉండనుంది.
అధికారుల కోసం డిసెంబర్ 5, 6 తేదీల్లో ఉదయం యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక పర్యటన చివరి రోజైన డిసెంబర్ 6న సాయంత్రం ప్రధాని మోదీ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు.
అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుపతిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వసతి, రవాణా, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.