PM Modi: ఆగస్టు 1న ఏపీకి ప్రధాని.. రూ.17,900 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలో ఆయన పర్యటించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మౌలిక సదుపాయంగా నిలవనుంది.
వివరాలు
ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన
అదే కార్యక్రమంలో విశాఖపట్నంలో రూ.460 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
ఈ ప్లాంట్‌లో ప్రతి ఏడాది సుమారు 9.6 కోట్ల (96 మిలియన్) సెమీకండక్టర్ చిప్‌లు తయారు చేసే సామర్థ్యం ఉండనుంది.
దీంతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి కొత్త ఊతం లభించనుంది.
పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసే దిశగా రూ.5,550 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు-IV పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
వివరాలు
జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
అలాగే కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని సోలార్-విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన రూ.3,550 కోట్ల, రూ.820 కోట్ల విద్యుత్ ప్రసార(ట్రాన్స్‌మిషన్)ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగం, ప్రసార సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాయి.
ఇక రూ.1,880కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు కూడా ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ రహదారి ప్రాజెక్టుల ద్వారా విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది.
అలాగే ప్రాంతాల మధ్య అనుసంధానం మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
భోగాపురం కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ కర్ణాటకలోని మైసూరుకు వెళ్లనున్నారు.
అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించే బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.