LOADING...
Vande Bharat Sleeper: కోల్‌కతా-గువాహటి మార్గంలో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు..!
కోల్‌కతా-గువాహటి మార్గంలో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు..!

Vande Bharat Sleeper: కోల్‌కతా-గువాహటి మార్గంలో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుదూర మార్గాల్లో ప్రయాణించే రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు సేవల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం అధికారికంగా వెల్లడించారు. తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు కోల్‌కతా-గువాహటి మార్గంలో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌-అస్సాం రాష్ట్రాల మధ్య నడిచే ఈ రైల్లో టికెట్‌ ధరలు విమాన ఛార్జీలతో పోలిస్తే తక్కువగా ఉండనున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాబోయే 15 నుంచి 20 రోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశముందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

వివరాలు 

కోల్‌కతా-గువాహటి మధ్య విమాన ప్రయాణానికి రూ.6,000 నుంచి రూ.8,000 వరకు ఖర్చు 

జనవరి 18 లేదా 19 తేదీల్లో ప్రారంభోత్సవం జరిగే అవకాశముందని పేర్కొన్నారు. రైలు ప్రారంభానికి సంబంధించిన విషయాన్ని ఇప్పటికే ప్రధాని మోదీకి తెలియజేశామని చెప్పారు. ప్రారంభోత్సవం తేదీపై స్పష్టతను 2-3 రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కోల్‌కతా-గువాహటి మధ్య విమాన ప్రయాణానికి రూ.6,000 నుంచి రూ.8,000 వరకు ఖర్చవుతోందని తెలిపారు. అయితే వందేభారత్‌ స్లీపర్‌లో 3 ఏసీ టికెట్‌ ధర (భోజనంతో కలిపి) సుమారు రూ.2,300, 2 ఏసీ సుమారు రూ.3,000, 1 ఏసీ సుమారు రూ.3,600గా ఉండే అవకాశముందని చెప్పారు. మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని టికెట్‌ ధరలను నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది అస్సాం, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రైలు ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగం..

ఇదిలా ఉండగా,వందేభారత్‌ స్లీపర్‌ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని సాధించగలదని రైల్వే శాఖ వెల్లడించింది. రైల్వే భద్రత కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) సమక్షంలో రాజస్థాన్‌లోని కోటా నుంచి మధ్యప్రదేశ్‌లోని నాగ్దా వరకు నిర్వహించిన తుది పరీక్షల్లో ఈ వేగాన్ని నమోదు చేసింది. పరీక్షల సందర్భంగా గాజు గ్లాసుల్లో నీటిని నింపి ఒకదానిపై ఒకటిగా రైల్లో ఉంచినప్పటికీ, గరిష్ఠ వేగంలో కూడా అవి ఏమాత్రం కదలకపోవడాన్ని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ వందేభారత్‌ స్లీపర్‌ రైల్లో మొత్తం 16 బోగీలు ఉండనున్నాయి.ఇందులో ఆకర్షణీయమైన ఏసీ స్లీపర్‌ బెర్తులు,అధునాతన సస్పెన్షన్‌ వ్యవస్థ, ఆధునిక మరుగుదొడ్లు, అగ్నిప్రమాదాలను గుర్తించే సదుపాయాలు, సీసీటీవీ నిఘా వ్యవస్థ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అశ్వినీ వైష్ణవ్‌ చేసిన ట్వీట్ 

Advertisement