LOADING...
PM Modi: 2026 బడ్జెట్ కు ముందు ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం 

PM Modi: 2026 బడ్జెట్ కు ముందు ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రముఖ ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితులు, వృద్ధి రేటు, ఆర్థిక సంస్కరణలు, ఉపాధి అవకాశాల పెంపు, ఎగుమతుల విస్తరణ వంటి ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చ జరుగనుంది. సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెరీ, సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొననుండటం విశేషం. ఈ చర్చలు 2026-27 బడ్జెట్‌లో ప్రాధాన్యతలు నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంచనా. ప్రధాని మోదీ సమావేశంలో 'ఆత్మనిర్భర్ భారత్'లక్ష్య సాధన, అలాగే 2047 నాటికి భారత్‌ను వికసిత దేశంగా మార్చడానికి తీసుకోవాల్సిన దీర్ఘకాలిక వ్యూహాలపై దృష్టి పెట్టనున్నారు.

వివరాలు 

 ఫిబ్రవరి 1 లేదా ఆ తరువాతే లోక్‌సభలో 2026-27 యూనియన్ బడ్జెట్

ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్ధితులు,ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యం భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్ విధించిన నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను పొందింది. అదే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వ్యాపార సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, రాష్ట్ర ఆర్థిక మంత్రులు,వివిధ రంగాల ప్రతినిధులతో పలు ప్రీ-బడ్జెట్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇలా,2026 ఫిబ్రవరి 1 లేదా ఆ తరువాతే ఆర్థిక మంత్రి లోక్‌సభలో 2026-27 యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2017 నుండి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే,ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతి,రైతులు,యువత,మహిళలు,MSMEలు,వ్యవసాయం,తయారీ రంగాలు,ఉపాధి సృష్టి, ఎగుమతుల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement