LOADING...
PM Modi: అంతర్జాతీయ వృద్ధికి పునాది.. భారత్‌-ఆసియాన్‌ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ ఉద్ఘాటన 
భారత్‌-ఆసియాన్‌ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ ఉద్ఘాటన

PM Modi: అంతర్జాతీయ వృద్ధికి పునాది.. భారత్‌-ఆసియాన్‌ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ ఉద్ఘాటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర అభివృద్ధి,వృద్ధికి భారత్‌-ఆసియాన్‌ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తిమంతమైన పునాదిగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 2026వ సంవత్సరాన్ని సముద్రరంగంలో భారత్‌-ఆసియాన్‌ సహకార సంవత్సరంగా ప్రకటించారు. గ్లోబల్‌ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఇరు వర్గాల మధ్య సంబంధాలు నిరంతరంగా పురోగమిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌) వార్షిక సదస్సులో ఆదివారం వర్చువల్‌ విధానంలో ప్రసంగించిన మోదీ, దాదాపు 15 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిన భారత్‌-ఆసియాన్‌ సరకు వాణిజ్య ఒప్పందం (AIFTA)ను త్వరితగతిన సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి ఆ సమీక్షా ప్రక్రియ పూర్తి కావచ్చని మలేసియా ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీం వెల్లడించారు.

వివరాలు 

తూర్పు తైమూర్‌కి ఆసియాన్‌లో చోటు 

ఆసియాన్‌లో 11వ సభ్యదేశంగా తూర్పు తైమూర్‌ (తైమూర్‌ లెస్ట్‌) ఆదివారం అధికారికంగా చేరింది. తమ కల నెరవేరిందని ఆ దేశ ప్రధానమంత్రి షనానా గుస్మావో పేర్కొన్నారు. ఇది 1990ల తర్వాత ఆసియాన్‌ విస్తరణలో మొదటిది కావడం విశేషం. కంబోడియా-థాయిలాండ్‌ ఒప్పందం కంబోడియా, థాయిలాండ్‌ ఆదివారం కాల్పుల విరమణ విస్తరణపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై కౌలాలంపుర్‌లో ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమక్షంలో కంబోడియా ప్రధాని హున్‌ మానెట్‌,థాయిలాండ్‌ ప్రధాని అనుతిన్‌ చర్న్‌విరకుల్‌ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం,థాయిలాండ్‌ తమ వద్ద బందీలుగా ఉన్న 18 మంది కంబోడియా సైనికులను విడుదల చేయాలి. అదేవిధంగా, ఇరు దేశాలు సరిహద్దుల నుంచి భారీ ఆయుధాలను ఉపసంహరించుకోవాలి.

వివరాలు 

పాకిస్తాన్‌ నాయకులపై ట్రంప్‌ ప్రశంసలు 

ఇటీవల ట్రంప్‌ చొరవతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధ్యమైన విషయం ప్రస్తావనీయమైనది. ఆ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్‌ పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్‌, సైన్యాధిపతి అసీమ్‌ మునీర్‌లను ప్రశంసించారు. వారిద్దరినీ గొప్ప నాయకులుగా పేర్కొంటూ, పాక్‌-అఫ్గానిస్థాన్‌ సంఘర్షణకు త్వరిత పరిష్కారం కనుగొంటామని తెలిపారు. "గతంలో అమెరికా అధ్యక్షులు యుద్ధాలు ప్రారంభించేవారు, కానీ ముగించేవారు కాదు" అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

మరోసారి కిమ్‌తో భేటీ? 

దక్షిణ కొరియాలో ఈ నెల 31 నుండి నవంబర్‌ 1 వరకు జరిగే ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొననున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఆ తర్వాత ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో తాను మళ్లీ సమావేశం కావచ్చని చెప్పారు. 2019లో వీరిద్దరి మధ్య జరిగిన భేటీ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

వివరాలు 

భారత్‌ రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తోంది: ట్రంప్‌ 

వాషింగ్టన్‌ నుంచి మలేసియాకు బయలుదేరే ముందు ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో విలేకర్లతో ట్రంప్‌ మాట్లాడుతూ, "భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు దాదాపుగా నిలిపేస్తోంది. చైనా కూడా మాస్కో నుంచి చమురు దిగుమతుల్లో గణనీయమైన కోతలు విధిస్తోంది. భారత్‌-పాకిస్తాన్‌ ఘర్షణలతో పాటు కొన్ని యుద్ధాలు ఆగడం కష్టం అనుకున్నా. కానీ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సులభంగా ఆగుతుందని భావించాను, కానీ అది పొరపాటు అని తేలింది. పుతిన్‌, జెలెన్‌స్కీ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి" " అని పేర్కొన్నారు.

వివరాలు 

భారత్‌-ఆసియాన్‌ సంబంధాల ప్రాముఖ్యత 

దిల్లీ 'యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ'కి ఆసియాన్‌ ప్రధాన మూలస్తంభమని మోదీ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఈ సంఘానికి భారత్‌ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ప్రతి సంక్షోభ సమయంలో ఆసియాన్‌ మిత్రదేశాలకు భారత్‌ మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు. విద్య, పర్యాటకం, శాస్త్ర-సాంకేతికత, ఆరోగ్యం, హరిత ఇంధనం, సైబర్‌ భద్రత వంటి విభాగాల్లో పరస్పర సహకారం మరింత బలపడుతోందని చెప్పారు. "21వ శతాబ్దం భారత్‌-ఆసియాన్‌దే," అని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. ఆసియాన్‌ 'విజన్‌-2045' మరియు 'వికసిత్‌ భారత్‌-2047' లక్ష్యాలు ప్రపంచ మానవ సమాజానికి మెరుగైన భవిష్యత్తును అందించడంలో తోడ్పడతాయని ఆయన విశ్వసించారు.