
PM Modi: నేడు అరుణాచల్‌ప్రదేశ్,త్రిపురలో మోదీ పర్యటన.. రూ.5,100 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రెండు రాష్ట్రాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆయన అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.5,100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టనున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక వసతులు, అలాగే త్రిపురలోని మాతా త్రిపుర సుందరి ఆలయ అభివృద్ధి పనులు సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. మొదటగా ప్రధాని అరుణాచల్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా పలు కీలక ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యంగా జలవిద్యుత్ రంగంలో హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (240 మెగావాట్లు), టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (186 మెగావాట్లు) నిర్మాణానికి శ్రీకారం చుడతారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు కలిపి రూ.3,700 కోట్లకుపైగా పెట్టుబడితో అమలు కానున్నాయి.
వివరాలు
1,500 మందికి పైగా అతిథులు కూర్చునే కన్వెన్షన్ సెంటర్
అదనంగా, తవాంగ్‌లో సముద్ర మట్టానికి 9,820 అడుగుల ఎత్తులో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులకు కూడా మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ సెంటర్‌లో 1,500 మందికి పైగా అతిథులు కూర్చునే అవకాశం ఉంటుంది. తరువాత ప్రధాని త్రిపుర రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ప్రసాద్ పథకం కింద మాతాబరి వద్ద ఉన్న ప్రసిద్ధ మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 51 శక్తి పీఠాల్లో ఒకటైన ఈ పురాతన ఆలయం ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చెందనుంది.
వివరాలు
తాబేలు ఆకారపు ప్రత్యేక లేఅవుట్‌తో పలు సౌకర్యాలు ఏర్పాటు
కొత్త రహదారులు, ధ్యాన మందిరం, యాత్రికుల వసతులు, అలాగే తాబేలు ఆకారపు ప్రత్యేక లేఅవుట్‌తో పలు సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా తీర్థయాత్ర పర్యాటకానికి ఊతం లభిస్తుందని, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, గోమతి జిల్లా సహా పరిసర ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.