PM Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. జీ7 సదస్సులో కీలక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల వారం రోజుల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో జరిగే జీ7 (G7) సదస్సులో పాల్గొనడంతో పాటు పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరపనున్నారు. పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో మోదీ మాట్లాడుతూ, భారత వ్యూహాత్మక దృష్టిలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌ను సందర్శించిన సందర్భంగా ఇరు దేశాలు తమ సంబంధాలను 'స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్' స్థాయికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.
వివరాలు
స్లోవేకియాలో తొలిసారి పర్యటన
ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో అధ్యక్షుడు మాక్రాన్‌తో సమావేశం కానున్నట్లు మోదీ తెలిపారు. ఫిబ్రవరి నుంచి ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ సహకార కార్యాచరణపై చర్చించనున్నట్లు వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. అనంతరం మోదీ స్లోవేకియాను సందర్శించనున్నారు. 1993లో స్లోవేకియా స్వాతంత్య్రం పొందిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. జీ7 సదస్సులో పాల్గొనే సందర్భంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రత, వాతావరణ మార్పులు, గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మోదీ ప్రస్తావించే అవకాశం ఉంది.