LOADING...
PM Modi UAE Visit: మోదీ యూఏఈ టూర్ సక్సెస్.. రక్షణ, ఎల్పీజీ, మౌలిక వసతులపై కీలక ఒప్పందాలు
మోదీ యూఏఈ టూర్ సక్సెస్.. రక్షణ, ఎల్పీజీ, మౌలిక వసతులపై కీలక ఒప్పందాలు

PM Modi UAE Visit: మోదీ యూఏఈ టూర్ సక్సెస్.. రక్షణ, ఎల్పీజీ, మౌలిక వసతులపై కీలక ఒప్పందాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనలో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ, ఇంధనం, మౌలిక వసతులు, పెట్టుబడుల రంగాల్లో భారత్-యూఏఈ మధ్య పలు భారీ అగ్రిమెంట్లు జరిగాయి. ముఖ్యంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం కుదరడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రెండు దేశాల మధ్య భద్రతా, సైనిక సహకారం మరింత బలపడనుంది. ఇంధన భద్రతపై కూడా రెండు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్‌కు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు జరిగాయి. అలాగే భారత్‌కు ఎల్పీజీ సరఫరాలపై కూడా అంగీకారం కుదిరింది. దీని ద్వారా హైడ్రోకార్బన్ రంగంలో దీర్ఘకాలిక సహకారం మరింత విస్తరించనుంది.

వివరాలు 

గుజరాత్‌లోని వడినార్‌లో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం ఎంఓయూ

అబుదాబికి చేరుకున్న ప్రధాని మోదీకి యూఏఈ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు. "ఇప్పటివరకు ఫోన్‌లో మాట్లాడేవాళ్లం..ఇప్పుడు ప్రత్యక్షంగా కలవడం ఆనందంగా ఉంది" అని తెలిపారు. గుజరాత్‌లోని వడినార్‌లో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం మరో ఎంఓయూపై కూడా సంతకాలు జరిగాయి. దీని వల్ల పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు ఊతమిచ్చే అవకాశం ఉండగా,ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. అదేవిధంగా భారత్‌లో మౌలిక వసతుల ప్రాజెక్టులు,ఆర్బీఎల్ బ్యాంక్,సమ్మన్ క్యాపిటల్‌లో పెట్టుబడుల కోసం యూఏఈ నుంచి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించారు. భారత్ వృద్ధిపై యూఏఈ పెట్టుబడిదారుల నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాలు 

భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెట్టిన దేశాల్లో యూఏఈ ఏడో స్థానం

గత 25 ఏళ్లలో భారత్‌కు అతిపెద్ద విదేశీ పెట్టుబడులు పెట్టిన దేశాల్లో యూఏఈ ఏడో స్థానంలో ఉంది. అలాగే భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. యూఏఈలో 45 లక్షలకుపైగా భారతీయులు నివసిస్తుండటంతో, వారి సంక్షేమంపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరిగింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, యూఏఈ భారత్‌కు విశ్వసనీయ ఇంధన భాగస్వామిగా కొనసాగుతోందని కేంద్రం పేర్కొంది. ఇప్పటికే ఉన్న దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలతో పాటు తాజా చర్చలు భారత్ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. యూఏఈపై జరిగిన దాడులను కూడా ప్రధాని మోదీ ఖండించారు. "యూఏఈని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు ఏ విధంగానూ సమర్థించలేము" అని మోదీ స్పష్టం చేశారు.

Advertisement