Mudigunta Village: ముదిగుంట గ్రామానికి ప్రధాని మోదీ ప్రశంసలు: ఇంకుడుగుంతలతో జలసంరక్షణలో ఆదర్శంగా నిలిచిన పల్లె
ఈ వార్తాకథనం ఏంటి
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామం జలసంరక్షణలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. గ్రామ ప్రజలు ఇంటింటా ఇంకుడుగుంతలను నిర్మించి నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చిన తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ కృషిని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మెచ్చుకోవడం ఈ గ్రామానికి మరింత గౌరవాన్ని తెచ్చింది. ఆదివారం జరిగిన 'మన్ కీ బాత్' 132వ ఎపిసోడ్‌లో ముదిగుంట గ్రామ ప్రజల ప్రయత్నాలను ప్రధాని ప్రస్తావించారు. గ్రామాభివృద్ధిలో వారి భాగస్వామ్యం, నీటి సంరక్షణలో చూపిన నిబద్ధతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని ప్రశంసలతో ముదిగుంట గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది.
వివరాలు
నీటి కొరత సమస్య తగ్గుముఖం
గ్రామంలో మొత్తం 1,571 మంది జనాభా ఉండగా, 443 కుటుంబాల్లో 353 కుటుంబాలు పూర్తిస్థాయిలో ఇంకుడుగుంతల నిర్మాణాన్ని చేపట్టాయి. అదేవిధంగా సామూహిక ఇంకుడుగుంతలు, నీటి కుంటల నిర్మాణం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఈ చర్యల వల్ల గ్రామంలో నీటి కొరత సమస్య తగ్గుముఖం పట్టింది. పంచాయతీ పరిధిలో సుమారు 402 కుటుంబాలు ఉపాధి హామీ పథకంలో భాగమయ్యాయి. గత తొమ్మిదేళ్లుగా గ్రామంలో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఇంకుడుగుంత నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,000 వరకు ఆర్థిక సాయం అందించడం కార్మికులకు ప్రోత్సాహకరంగా మారింది.
వివరాలు
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు: కిషన్ రెడ్డి
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ,ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హైదర్‌గూడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సూర్యాపేటకు చెందిన యువకుడు కోట్ల రఘువీర్ రెడ్డి ప్రతిభను కూడా ప్రధాని ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా ముదిగుంట గ్రామ ప్రజలు ఇంకుడుగుంతల నిర్మాణం ద్వారా నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు, సామాజిక సేవకులు,ఆవిష్కర్తలను ప్రధాని ప్రజలకు పరిచయం చేస్తూ స్ఫూర్తిని కలిగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల రామచంద్రారెడ్డి,ఎన్.వి. సుభాష్,ఇంద్రసేన్ రెడ్డి,లంకల దీపక్ రెడ్డి,ప్రేమ్ సింగ్ రాథోడ్,పి. ప్రసాద్,కె. శ్రీధర్, మాధవి తదితరులు పాల్గొన్నారు.