PM Narendra Modi: అజేయ సంకల్పానికి ప్రతీక సోమనాథ్.. మోదీ ప్రత్యేక సందేశం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ ఆత్మవిశ్వాసానికి, అజేయ సంకల్పానికి ప్రతీకగా నిలిచిన సోమనాథ్ ఆలయం మరో ముఖ్య ఘట్టాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమైంది. మే 11న నరేంద్ర మోదీ సోమనాథ్‌ను సందర్శించనున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునర్నిర్మాణం పూర్తిై ప్రారంభమైన ఈ ఆలయానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సందర్భంలో ప్రధాని రాసిన ప్రత్యేక వ్యాసం భారతీయ సంస్కృతి మహిమాన్వితతను, విధ్వంసం నుంచి పునర్నిర్మాణ దిశగా సాగిన ప్రస్థానాన్ని స్పష్టంగా తెలియజేసింది. "ఎంతటి తుఫానులు వచ్చినా, అలలు ఎంత ఉధృతంగా ఎగిసినా, గౌరవంతో మళ్లీ నిలబడవచ్చని సోమనాథ్ తీరపు అలలు మనకు నేర్పుతాయి" అని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
మహనీయుల కృషికి వందనం
2026 ఆరంభంలో ఆలయంపై జరిగిన మొదటి దాడికి వెయ్యేళ్లు పూర్తవుతున్న విషయాన్ని గుర్తుచేసిన ప్రధాని, పునరుద్ధరణకు 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ వేళ అక్కడికి రావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. సోమనాథ్ ఆలయాన్ని కాపాడి, పునర్నిర్మించేందుకు శతాబ్దాలుగా కృషి చేసిన మహనీయులను ప్రధాని స్మరించారు. మహారాజు ధరాసేన, రాజా భోజుడు, సిద్ధరాజ జయసింహ వంటి రాజుల సేవలను గుర్తుచేశారు. విదేశీ దండయాత్రల నుంచి సంస్కృతిని రక్షించిన భీమదేవ, హమీర్జీ గోహిల్, వేగ్దాజీ భిల్ వంటి వీరుల త్యాగాలను ప్రశంసించారు. కష్టకాలాల్లో ఆలయ వైభవాన్ని నిలబెట్టిన పుణ్యశ్లోక్ అహల్యాబాయి హోల్కర్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వివరాలు
పటేల్ సంకల్పం - ప్రసాద్ ఆచరణ
స్వాతంత్ర్యం అనంతరం 1947లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ తీసుకున్న పునర్నిర్మాణ నిర్ణయం చరిత్రాత్మకమని ప్రధాని పేర్కొన్నారు. ఆయన పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఒక్కటయ్యారని, ఆ సంకల్పాన్ని కె.ఎం. మున్షీ ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. 1951లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, దేశపు తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరై భారతీయ సంప్రదాయాలకు గౌరవం చాటారని గుర్తు చేశారు.
వివరాలు
అభివృద్ధి తోడుగా వారసత్వం
గత పదేళ్లుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రధాని వివరించారు. సోమనాథ్ నుంచి కాశీ వరకు,అయోధ్య నుంచి కేదార్‌నాథ్ ఆలయం వరకు ఆధ్యాత్మిక కేంద్రాలను ఆధునీకరిస్తూనే,వాటి ప్రాచీనతను కాపాడుతున్నామని తెలిపారు. దీని ద్వారా భక్తులకు సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, దేశ ఐక్యత మరింత పటిష్టమవుతుందని అన్నారు. సోమనాథ్ వెయ్యేళ్ల చరిత్రకు నివాళిగా రాబోయే వెయ్యి రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారని చెప్పారు. "సోమనాథ్ తీరంలో నిలబడితే భారతదేశపు అజేయమైన ఆత్మబలం మనకు స్పష్టంగా కనిపిస్తుంది" అని ప్రధాని పేర్కొంటూ, ప్రతి భారతీయుడు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి మన నాగరికత వైభవాన్ని అనుభవించాలని పిలుపునిచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
Wrote an OpEd about my forthcoming visit to Somnath on 11th May and why this day will always be important with respect to Somnath and the greatness of our civilisation. Also paid homage to each and every person who endured all sorts of challenges yet always protected Somnath and…
— Narendra Modi (@narendramodi) May 8, 2026