LOADING...
PM Modi: కర్పూరీ ఠాకూర్‌కు నివాళులతో బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
కర్పూరీ ఠాకూర్‌కు నివాళులతో బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ

PM Modi: కర్పూరీ ఠాకూర్‌కు నివాళులతో బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను ఈసారి అటు ఎన్డీయే, ఇటు ఇండియా బ్లాక్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అధికారికంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సమస్తీపుర్‌ జిల్లా కర్పూరీ గ్రామం ఆ ప్రారంభ సభకు వేదికైంది. బిహార్‌ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకూర్‌ (Karpoori Thakur)కు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన 'రోజ్‌గార్ మేళా'లో యువతను ఉద్దేశించి మాట్లాడారు.

వివరాలు 

కులవివక్షకు వ్యతిరేకంగా కర్పూరీ ఠాకూర్ ఉద్యమం

"యువతకు సాధికారత కల్పించడం మా కూటమి (NDA) ప్రధాన లక్ష్యం. పండుగల కాలంలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ రోజు 51 వేలమంది యువత ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అది నాకు సంతోషాన్నిస్తుంది. ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు," అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బిహార్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు నిర్ణయించడంలో కూడా అవే ప్రధానమైన అంశాలుగా నిలుస్తున్నాయి. ఈ వ్యవస్థను మార్చే ప్రయత్నం కొన్ని దశాబ్దాల క్రితమే కర్పూరీ ఠాకూర్ ప్రారంభించారు. తన స్వగ్రామమైన పితౌంఝియాలో కులవివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు. అణగారిన వర్గాలకు రాజకీయ చైతన్యం తెచ్చారు.

వివరాలు 

ప్రజల గుండెల్లో  "జన నాయక్‌"

ముఖ్యమంత్రిగా రెండు సార్లు (1970 డిసెంబరు నుంచి 1971 జూన్ వరకు, 1977 డిసెంబరు నుంచి 1979 ఏప్రిల్ వరకు) బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆయన జీవనశైలి సాధారణంగానే ఉండేది. పాత గుడిసెల్లోనే నివసిస్తూ ప్రజల మధ్యే ఉండేవారు. తన పరిపాలనా దక్షత, ప్రజాసేవా తపనతో ఆయన "జన నాయక్‌"గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. గత సంవత్సరం ఆయన జన్మశతాబ్దిని పురస్కరించుకుని, కేంద్ర ప్రభుత్వం కర్పూరీ ఠాకూర్‌ను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన "భారతరత్న"తో సత్కరించింది.