
PM Modi: అయోధ్య రాముడిపై పాటలు, కవితలు రాస్తే.. షేర్ చేయండి: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా అయోధ్య రాముడి ఫీవర్ నెలకొంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అయోధ్య రాముడికి సంబంధించిన భజనలు, కవితలు, పాటలు, కీర్తలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
'#శ్రీరామ్ భజన్ (#sriram bhajan)' హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పంచుకోవాలని మోదీ కోరారు.
ఆదివారం నిర్వహించిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ మేరకు పేర్కొన్నారు.
అయోధ్యలో రామమందిరం విషయంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ, ఉత్సాహం నెలకొని ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు అనేక రకాలుగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా
నేను కూడా కొన్ని షేర్ చేశా: మోదీ
గత కొద్ది రోజులుగా శ్రీరాముడిపై, అయోధ్యపై ఎన్నో కొత్త పాటలు, కొత్త భజనలను అనేకమంది రచించి ఉంటారని మోదీ అన్నారు.
రాసిన వారిలో అనుభవజ్ఞులైన కళాకారులు, వర్ధమాన యువ కళాకారులు కూడా హృదయాన్ని హత్తుకునే భజనలను కంపోజ్ చేసినట్లు మోదీ పేర్కొన్నారు.
తన సోషల్ మీడియాలో కొన్ని పాటలు, భజనలను పంచుకున్నట్లు చెప్పారు.
ఈ చారిత్రక ఘట్టంలో కళాకారులు తనదైన విశిష్టమైన రీతిలో భాగస్వామ్యులుగా మారుతున్నట్లు అనిపిస్తోందని ప్రధాని అన్నారు.
అందరం కలిసి 'శ్రీరామ్ భజన్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో శ్రీరాముడి పాటలు, భజనలను పంచుకుంటే బాగుంటుందన్నారు.