Loading...
Polavaram: పోలవరం తొలిదశ పూర్తి ఎప్పటికి? గడువు పొడిగింపుపై ఐదుగురు సభ్యులతో కమిటీ
పోలవరం తొలిదశ పూర్తి ఎప్పటికి? గడువు పొడిగింపుపై ఐదుగురు సభ్యులతో కమిటీ

Polavaram: పోలవరం తొలిదశ పూర్తి ఎప్పటికి? గడువు పొడిగింపుపై ఐదుగురు సభ్యులతో కమిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం కచ్చితంగా ఎప్పటికి పూర్తవుతుందో నిర్ధారించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా నివేదిక అందించాలని కమిటీని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు, డిజైన్ల ఆమోదం, వివిధ విభాగాల్లో మిగిలిన పనుల పరిమాణం, వాటిని పూర్తి చేయడానికి పట్టే సమయంపై కమిటీ అధ్యయనం చేయనుంది. 2027 మార్చి తర్వాత ఇంకా ఎంతకాలం అవసరమవుతుందో కూడా అంచనా వేయనుంది.

వివరాలు 

చర్చకు గడువు పొడిగింపు అంశం

ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పోలవరం నిర్మాణ గడువును పొడిగించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖకు పీపీఏ లేఖ రాయనుంది.

కేంద్రం అనుమతి లభిస్తేనే 2027-28 ఆర్థిక సంవత్సరంలోనూ పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన కేంద్ర నిధులను ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది.

ఈ మేరకు పీపీఏ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో పీపీఏ సభ్య కార్యదర్శి, పోలవరం అథారిటీ చీఫ్‌ ఇంజినీర్‌ (ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌), రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌, వ్యాప్కోస్‌ జనరల్‌ మేనేజర్‌, పునరావాస కమిషనర్‌లను సభ్యులుగా నియమించారు.

గత నెలలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించినప్పుడు కూడా గడువు పొడిగింపు అంశం చర్చకు వచ్చింది.

వివరాలు 

ఎందుకీ కమిటీ?

పోలవరం ప్రాజెక్టు తొలిదశకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2024 జూన్‌ తర్వాత అంచనాలను రూ.30,436.95 కోట్లకు సవరించింది.

ప్రాజెక్టులో +41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా ఈ నిధులను మంజూరు చేసింది.

అప్పటికే విడుదల చేసిన మొత్తాన్ని మినహాయించి, మిగిలిన రూ.12,157.53 కోట్లను కూడా అడ్వాన్సుగా ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది.

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది ఒకటి.

ఈ నిధుల విడుదలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సమయంలో ప్రాజెక్టు తొలిదశను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని గడువు విధించింది.

ఒకవేళ అప్పటికి పూర్తి కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 మార్చి నెలాఖరులోగా నిర్మాణం పూర్తిచేయాలని షరతు పెట్టింది.

ADVERTISEMENT

వివరాలు 

ఎందుకీ కమిటీ?

అయితే 2026 మార్చి నాటికి పనులు పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈ ఏడాది మార్చిలో కేంద్ర జలశక్తి శాఖ మరోసారి అనుమతినిచ్చింది.

2027 మార్చి 31 నాటికి తొలిదశను పూర్తి చేయాలని గడువును పొడిగించింది.

ప్రస్తుతం పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నప్పటికీ, 2027 మార్చి నెలాఖరులోగా పూర్తవుతాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

2027 జూన్‌ నెలాఖరుకు మాత్రం పనులు పూర్తి చేయగలమనే నమ్మకం అధికార యంత్రాంగంలో కనిపిస్తోంది.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి గడువు పొడిగింపు ఉత్తర్వులు పొందాల్సి ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రాజెక్టు పనుల పురోగతిపై సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించిన పీపీఏ

అంచనాల సవరణ కమిటీ ఆమోదం ప్రకారం 2027 మార్చి 31 వరకు మాత్రమే ప్రాజెక్టు నిధులను ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది.

ఆ తర్వాత ప్రారంభమయ్యే 2027-28 ఆర్థిక సంవత్సరంలోనూ పోలవరం పనులకు నిధులు వెచ్చించాలంటే కేంద్రం ముందస్తు అనుమతి తప్పనిసరి.

ప్రస్తుత అంచనాల ప్రకారం ఆ ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టుపై మరో రూ.981.12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖకు గడువు పొడిగింపు కోసం లేఖ రాసే ముందు ప్రాజెక్టు పనుల పురోగతిపై సమగ్ర అధ్యయనం చేయాలని పీపీఏ నిర్ణయించింది.

అందులో భాగంగానే ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

వివరాలు 

పనుల పురోగతి, మిగిలిన గడువుపై అధ్యయనం

ప్రాజెక్టు నిర్మాణ, ఆర్థిక పురోగతిని కమిటీ సమగ్రంగా అంచనా వేయనుంది.

ప్రధాన డ్యాం నిర్మాణానికి అవసరమైన డిజైన్ల ఆమోదం,పనులు పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్న వనరులు,రక్షణ పనులకు సంబంధించిన అంశాలను పరిశీలించనుంది.

2027 మార్చి తర్వాత పనులు పూర్తి చేయడానికి ఎంత సమయం అవసరం? అందుకు తగిన యంత్రాలు, సిబ్బంది,ఇతర వనరులు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనే విషయాలను కూడా అధ్యయనం చేయనుంది.

అదేవిధంగా భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణంలో వాస్తవంగా ఎంత పురోగతి సాధించారో పరిశీలించనుంది.

వివరాలు 

పనుల పురోగతి, మిగిలిన గడువుపై అధ్యయనం

ఈ పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయో అంచనా వేయనుంది. అయితే కమిటీ సూచించే, చేపట్టాల్సిన పనులన్నీ కేంద్రం సవరించిన రూ.30,436.95 కోట్ల అంచనా పరిధిలోనే ఉండాలి.

మొత్తంగా పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి మరింత సమయం అవసరమయ్యే పరిస్థితులపై స్పష్టత తీసుకురావడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం.

కేంద్ర జలశక్తి శాఖకు గడువు పొడిగింపు ప్రతిపాదన పంపేందుకు అవసరమైన వివరాలు, అంచనాలతో నివేదిక సిద్ధం చేయనుంది.

ADVERTISEMENT