Parliment Attack: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం..లోక్ సభలో కి దూకిన ఇద్దరు
పార్లమెంట్‌లో బుధవారం భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు ఆగంతుకులు లోక్‌సభ పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి టియర్ గ్యాస్ కూడా విడుదల చేశారు. దీని కారణంగా ఆవరణలో పొగ వ్యాపించింది. కొందరు ఎంపీలు వారిద్దరిని పట్టుకుని భద్రతా బలగాలకు అప్పగించారు. లోక్‌సభలోకి దూకిన వ్యక్తులలో ఒకరు .. ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి 'నల్ల చట్టాలను బంద్ చేయాలి' అని నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో సభలో కలకలం రేగడంతో ఎంపీలు బయటకు వచ్చారు. స్పీకర్ వెంటనే సభను వాయిదా వేశారు. ఈ ఘటన జరిగే సమయంలో భాజపా ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్నారు.
2001లో ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి
ఈ ఘటనపై ఎంపీలు స్పందిస్తూ పార్లమెంట్‌లో ఈ రోజుటి అనుభవం చాలా భయానకంగా ఉందన్నారు. ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారని సస్పెండ్ అయిన బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ చెప్పారు. ఈ ఘటనతో కొత్త పార్లమెంట్ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అన్నారు. 2001లో ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. లష్కరే తొయిబా, జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరపడంతో 9 మంది అమరులయ్యారు. వీరిలో ఆరుగురు దిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు.