Tamil Nadu: బలపరీక్షకు ముందు తమిళనాడులో రాజకీయ కలకలం.. విజయ్‌తో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ బలపరీక్షను ఎదుర్కొనే వేళ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకేలో విభేదాలు తీవ్రరూపం దాల్చగా, తాజాగా ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం కావడం చర్చనీయాంశమైంది. మిత్రపక్షాల నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రతినిధులతో సమావేశమైన అనంతరం విజయ్ అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగం నివాసానికి వెళ్లారు. అక్కడ షణ్ముగం వర్గానికి చెందిన రెబల్ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బుధవారం అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు ముందు ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
ఫలితాల అనంతరం పార్టీలో అంతర్గత విభేదాలు
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాల్లో గెలుపొందింది. అయితే ఫలితాల అనంతరం పార్టీలో అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి వ్యవహార శైలిపై సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, సి. విజయభాస్కర్ తదితర సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత శనివారం జరిగిన పార్టీ సమావేశంలో విజయ్ ముఖ్యమంత్రి పదవికి మద్దతు ఇవ్వాలన్న అంశంతో పాటు శాసనసభ కమిటీ నాయకత్వ బాధ్యతలపై తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈపీఎస్ నిర్ణయాలను వ్యతిరేకించిన సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించారు. అప్పటి నుంచి పార్టీలో చీలిక స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది.
వివరాలు
తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
ఇదే క్రమంలో తాము అన్నాడీఎంకేను వీడి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని షణ్ముగం నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం ప్రకటించారు. అనంతరం వారి నివాసానికి వెళ్లిన విజయ్, రెబల్ ఎమ్మెల్యేలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.