మూడు రాజధానులు V/S ఒక రాజధాని..!
ఏపీలో అప్పుడే రాజకీయ వేడీ మొదలైంది. ఎన్నికలకు సమయం ఉన్నా.. అప్పుడే ముందస్తు హడావుడి కనిపిస్తోంది. ఏపీలో ప్రధానంగా రెండు నియోజకవర్గాలపైనే వైసీపీ, టీడీపీ, జనసేన దృష్టి సారించాయి. తెలుగుదేశం పార్టీ ఒకటే రాజధాని అని చెబుతుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానులంటోంది. రానున్న ఎన్నికలు కూడా ఒక రాజధాని అమరావతి, మూడు రాజధానులు అంశంపై కీలక పోరు సాగనుంది. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మీద వ్యతిరేకత రావడంతో అదనపు సమన్వయకర్తగా సురేష్ ను నియమించారు. ఇప్పటికే అక్కడ డొక్కా, శ్రీదేవి మధ్య విభేదాలున్నాయి. ఇప్పుడు వారికి తోడుగా సురేష్ వర్గం సిద్ధమైనట్లు సమాచారం. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడం ఎస్సీలో వైసీపీ బలంగా ఉండటంతో ఇక్కడ గెలవడం సులువని భావిస్తున్నారు.
ఆళ్లను సత్తెనపల్లికి పంపించే అవకాశం?
మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ నాయకుడు గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకొని వైసీపీ చేనేత విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు. రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపించి ఇక్కడ చిరంజీవిని పోటీచేయించాలని జగన్ భావిస్తున్నారట. మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీచేస్తున్నారు కాబట్టి చేనేత వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెడితే గెలుస్తామని అదిష్టానం భావిస్తోంది. మరోవైపు లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయానికి మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలను చుట్టి రావాలన్నది నారా లోకేష్ లక్ష్యంగా ఉంది. మొబైల్ వ్యాన్స్ ద్వారా ఆరోగ్య రథాలను నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పంపిస్తున్నాడు. ఎవరి అభిప్రాయాన్ని ప్రజలు గౌరవిస్తారో తెలియాలంటే ఎన్నికలు జరిగేంతవరకూ ఎదురుచూడక తప్పదు.