Loading...
ASDD Votes: ముసాయిదా జాబితాలో చోటు దక్కని ఓటర్లపై ప్రత్యేక దృష్టి
ముసాయిదా జాబితాలో చోటు దక్కని ఓటర్లపై ప్రత్యేక దృష్టి

ASDD Votes: ముసాయిదా జాబితాలో చోటు దక్కని ఓటర్లపై ప్రత్యేక దృష్టి

వ్రాసిన వారు Moogati Shabari
Aug 16, 2026
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో అన్‌కలెక్టబుల్‌ (సేకరించడానికి వీలులేని) జాబితాలో చేర్చిన ఓటర్లపై రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ఏఎస్‌డీడీ కేటగిరీల్లో ఉన్న ఓటర్ల వివరాలను నియోజకవర్గాల వారీగా సేకరించి, వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 73.30 లక్షల మంది, అంటే 21.70 శాతం, మందిని ఎన్నికల అధికారులు ఏఎస్‌డీడీ కేటగిరీల కింద అన్‌కలెక్టబుల్‌ జాబితాలో చేర్చారు. ఈ విభాగంలో ఆచూకీ లేని వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మరణించిన వారు, డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నారు.

వివరాలు

ఆచూకీ లేని ఓటర్లు ఎంతమంది అంటే..

ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆచూకీ లేని ఓటర్లు 11,25,546 మంది ఉండగా, శాశ్వతంగా వలస వెళ్లిన వారి సంఖ్య 45,18,981గా ఉంది.

మరణించిన వారి ఓట్లు 9,22,230, డూప్లికేట్‌ ఓట్లు 6,70,203, ఇతర కారణాలతో అన్‌కలెక్టబుల్‌ కేటగిరీలో చేర్చిన ఓట్లు 1,02,294గా ఉన్నాయి.

ఈ ఓటర్లకు సంబంధించిన వివరాలు డిజిటలైజేషన్‌ ప్రక్రియలోకి రాకపోవడంతో.. ముసాయిదా ఓటర్ల జాబితాలో వారి పేర్లు కనిపించవు.

తొలగించిన ఓట్ల కింద వీటిని గుర్తించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్న ఓట్ల సంఖ్య భారీగా ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని కీలకంగా పరిగణిస్తున్నాయి.

వివరాలు

పార్టీలకు జాబితాలు అందించే ఏర్పాట్లు..

ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్న ఓటర్ల వివరాలను నియోజకవర్గాల వారీగా రాజకీయ పార్టీలకు అందించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ జాబితాలు అందిన వెంటనే వాటి ఆధారంగా సంబంధిత ఓటర్ల ఇళ్లకు వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని ప్రధాన పార్టీలు నిర్ణయించుకున్నాయి.

ఇప్పటికే ఓ ప్రధాన రాజకీయ పార్టీ నియోజకవర్గాల వారీగా ఏఎస్‌డీడీ జాబితాను తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఆ ఓటరు నిజంగానే ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్నారా? ఒకవేళ స్థానికంగానే నివసిస్తున్నట్లయితే ఆయన పేరును ఆ జాబితాలో ఎందుకు చేర్చారు? స్థానిక బీఎల్‌ఏలకు సమాచారం ఇవ్వకుండానే ఆ ఓటరును ఏఎస్‌డీడీ కేటగిరీలోకి ఎలా తీసుకెళ్లారు? వంటి అంశాలపై పార్టీ ప్రతినిధులు విచారణ చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు..

అనేక ప్రాంతాల్లో ఓటర్లకు ఎన్యూమరేషన్‌ పత్రాలు పంపిణీ చేయలేదని, అలా పత్రాలు అందకపోవడం వల్లే కొందరిని ఏఎస్‌డీడీ జాబితాలో చేర్చారేమోనన్న అనుమానాలు ఉన్నాయని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు.

ఈ నేపథ్యంలో తమ పార్టీ తరఫున ఇంటింటికీ వెళ్లి వాస్తవాలను పరిశీలించేందుకు సిద్ధమవుతున్నామని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఎలాంటి కారణం లేకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లను ఏఎస్‌డీడీ జాబితాలో చేర్చినట్లు తేలితే.. సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని ఆ నేత స్పష్టం చేశారు.

ADVERTISEMENT