Jagan Mohan Reddy: 'దేవుడి పేరుతో రాజకీయమా'.. లడ్డూ వివాదంపై స్పందించిన జగన్
తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ విషయంపై వచ్చిన ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పందనను తెలిపారు. ఆ ఆరోపణలు తప్పుడు సమాచారం అంటూ, అవి కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఖండించారు. సీఎం స్థాయిలో ఉంటూ ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని, భక్తుల మనోభావాలను అనవసరంగా దెబ్బతీసే ప్రయత్నం చేయడం ఏంటని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన జగన్, వంద రోజుల తరువాత తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎలా బయటకొచ్చిందని ప్రశ్నించారు. ఆయన చెప్పిన ప్రకారం, చంద్రబాబు హయాంలోనే ఈ కల్తీ జరిగిందని తేలింది. లడ్డూ తయారీ పద్ధతులు దశాబ్దాలుగా ఒకే విధంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం: జగన్
జగన్, చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, 100 రోజుల పాలనలో ముఖ్యమైన పథకాలు అమలు చేయలేకపోయినందున, కొత్త వివాదాలను తెరమీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. నెయ్యి కల్తీ గురించి చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం అని చెప్పారు. ఆయన హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యిని తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రతి విషయంలోనూ డైవర్షన్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయని పేర్కొంటూ,చంద్రబాబు హయాంలో జరిగిన పలుకారణ సంఘటనలను ప్రస్తావించారు. ముంబై నుంచి హీరోయిన్‌ను తెచ్చి మరో డైవర్షన్‌కు తెరలేపారని జగన్ ఆరోపించారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి నాణ్యతపై జరుగుతున్న ఆరోపణలను ఖండిస్తూ,జగన్, నెయ్యి ట్యాంకర్‌ను తిరుమలకు పంపించే ముందు అన్ని పరీక్షలు చేసి నెయ్యి శాంపిల్స్‌ను NABL సర్టిఫికెట్‌తో అనుమతిస్తారని వివరించారు.