త్రిపురలో ముగిసిన పోలింగ్; మార్చి 2న ఓట్ల లెక్కింపు
ఈ వార్తాకథనం ఏంటి
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రం 5గంటలకు ముసింగింది. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటలకు వరకు కొనసాగాల్సి ఉండంగా, పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అధికారులు సమయాన్ని మరో గంట పొడిగించారు.
సాయంత్రం 5గంటల సమయానికి 81శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు.
శాంతిర్‌బజార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కలచెర్రా పోలింగ్ స్టేషన్ వెలుపల అధికార బీజేపీ, సీపీఐ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడ్డారు.
త్రిపుర సీఎం మాణిక్ సాహా, సీపీఎం నాయకుడు, మాజీ సీఎం మాణిక్ సర్కార్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
త్రిపుర
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం
60స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి 259మంది అభ్యర్థులు పోటీచేశారు. వీరి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఎం అధికార బీజేపీని ఓడించేందుకు ఈ ఎన్నికల కోసం జట్టు కట్టాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న బీజేపీ ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్‌తో కలిసి పోటీ చేసింది. రాజ వంశీయుడు ప్రద్యోత్ కిషోర్ దెబ్బర్మచే ప్రారంభించిన టిప్రా మోతా పార్టీ కూడా ఈఎన్నికల్లో పోటీ చేయడంతో త్రిముఖ పోటీ నెలకొంది.
బీజేపీ 55స్థానాల్లో, దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీ ఆరు స్థానాల్లో పోటీ చేశాయి. ఆంపినగర్ నియోజకవర్గంలో మిత్రపక్షాలైన బీజేపీ, ఐపీఎఫ్‌టీ తమ అభ్యర్థులను నిలబెట్టడం గమనార్హం.
వామపక్షాలు 47, కాంగ్రెస్ 13స్థానాల్లో బరిలో నిలిచాయి.
మార్చి 2న ఓట్లను లెక్కించనున్నారు.