Loading...
Yogi Adityanath: దీపావళికి టపాసులు కాలిస్తే తప్పేంటి? యోగి కీలక వ్యాఖ్యలు
దీపావళికి టపాసులు కాలిస్తే తప్పేంటి? యోగి కీలక వ్యాఖ్యలు

Yogi Adityanath: దీపావళికి టపాసులు కాలిస్తే తప్పేంటి? యోగి కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దీపావళి వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా బాణసంచా కాల్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏడాదిలో ఒక్కరోజు వచ్చే పండుగను ఆనందంగా జరుపుకుంటే కాలుష్యం పేరుతో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎందుకని ప్రశ్నించారు. కాలుష్యం గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొంతకాలం తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని వ్యాఖ్యానించారు. ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో టపాసులు కాల్చడం సంతోషంగా ఉందని యోగి పేర్కొన్నారు. అయోధ్యలో జరిగిన దీపావళి వేడుకల్లో తాను కూడా పాల్గొని బాణసంచా కాల్చినట్లు గుర్తుచేశారు. తమ ప్రభుత్వం పండుగలపై ఆంక్షలు విధించడాన్ని ప్రోత్సహించదని స్పష్టం చేశారు.

వివరాలు 

అవినీతితో వ్యవస్థను కలుషితం చేసేవారిని ప్రశ్నించడం లేదని విమర్శ

ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా పండుగలను జరుపుకోవాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

వ్యవస్థ మొత్తాన్ని అవినీతి కార్యకలాపాలతో కలుషితం చేస్తున్నవారిని ఎవరూ ప్రశ్నించడం లేదని యోగి విమర్శించారు.

ప్రజలు ఒక్కరోజు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటే మాత్రం వెంటనే కాలుష్యం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు.

ఇతరులు పండుగలను ఆనందంగా జరుపుకుంటున్న సమయంలోనే కొందరికి కాలుష్యం గుర్తుకొస్తోందని వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఎన్‌సీఆర్‌ లో వాయు కాలుష్యం

మరోవైపు దీపావళికి ముందే దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది.

ముఖ్యంగా ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగించింది.

నవంబర్‌ 9న ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 371గా నమోదైంది. 2021 తర్వాత ఇదే అత్యంత అధ్వాన స్థాయి కావడం గమనార్హం.

నగరంలోని పలు పర్యవేక్షణ కేంద్రాల్లో ఏక్యూఐ 400 మార్కును దాటడంతో గాలి నాణ్యత తీవ్ర కేటగిరీలోకి చేరింది.

అయితే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడి 'పూర్‌' (నాసిరకం) స్థాయికి చేరుకుంది.

ADVERTISEMENT