Amani: బీజేపీలోకి చేరిన ప్రముఖ నటి అమని
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) అధికారికంగా చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకొని పార్టీలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆమనితో పాటు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ శోభలత కూడా బీజేపీలో చేరడం విశేషం. నెల్లూరు జిల్లాకు చెందిన ఆమని, తమిళ సినీ నిర్మాతను వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చారు. అయితే ఆ తర్వాత తిరిగి సినీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలతో బిజీగా కొనసాగుతున్నారు.
Details
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ
ముఖ్యంగా ఈ ఏడాది మాత్రమే ఆమె ఏకంగా ఐదు చిన్న చిత్రాల్లో నటించడం గమనార్హం. తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆమని రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. సినీ రంగం నుంచి పలువురు తమకు నచ్చిన రాజకీయ పార్టీల్లో చేరడం సాధారణమే అయినప్పటికీ, ఆమని బీజేపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు సామాజిక అంశాలపై ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ రావడం పార్టీ దృష్టిని ఆకర్షించింది. ఆమె వాయిస్ బీజేపీకి ఉపయోగపడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
Details
తెలుగు, తమిళ చిత్రాలతో గుర్తింపు
ఆమని తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. శుభలగ్నం, శుభసంకల్పం, శుభమస్తు, మావిచిగురు, ఘరానా బుల్లోడు, అమ్మ దొంగా వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన 'జంబలకిడిపంబ' (1993) చిత్రంలో నరేష్‌కు జంటగా నటిస్తూ ఆమె సినీ రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.