Census 2027: జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. కేంద్రం నోటిఫికేషన్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, మంచు తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కల సేకరణ కొనసాగనుంది. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా రాష్ట్రాలతోపాటు లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈసారి జనగణన నిర్వహించరు. మిగతా ప్రాంతాల్లో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జనాభా వివరాలను సేకరించనున్నారు.
వివరాలు
మార్పుల కోసం 2027 మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు అవకాశం
ఈ జనగణనకు 2027 మార్చి 1వ తేదీని ప్రామాణిక తేదీగా(రిఫరెన్స్ డేట్) నిర్ణయించారు.
జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలకు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
ఇందుకోసం ఆన్‌లైన్ లేదా ప్రభుత్వం నిర్దేశించిన ఇతర విధానాలను ఉపయోగించుకోవచ్చు.
ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకున్న అనంతరం జనవరి 25 నుంచి క్షేత్రస్థాయిలో జనగణన ప్రారంభమవుతుంది.
ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు.
ఈ ప్రక్రియ ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది.సేకరించిన వివరాల్లో ఏవైనా మార్పులు లేదా సవరణలు అవసరమైతే 2027 మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా షెడ్యూల్‌ను ప్రకటించింది.