Karnataka DGP: అశ్లీల వీడియోల వివాదం.. కర్ణాటక డీజీపీ సస్పెన్షన్ వెనుక అసలు కథ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన తన కార్యాలయంలోనే మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్యలు తీసుకుంది. వీడియోలు నిజమా? కాదా? అన్నది ఇంకా నిర్ధారణ కాకపోయినా, పెరుగుతున్న రాజకీయ దుమారం నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య అధికారిక విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలను రామచంద్రరావు ఖండించారు. వీడియోలు పూర్తిగా నకిలీవని, మార్ఫింగ్ చేసినవని ఆయన స్పష్టం చేశారు. తనను కావాలనే లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నారని తెలిపారు. ఈ వీడియోలు ఎలా, ఎప్పుడు తయారయ్యాయో నాకు తెలియదు. ఈ కాలంలో ఏదైనా సాధ్యమే. నాకు దీనిపై ఎలాంటి అవగాహన లేదని మీడియాతో చెప్పారు.
Details
అసలు ఏం జరిగింది?
డీజీపీ హోదాలో ఉన్న రామచంద్రరావు యూనిఫామ్‌లోనే కార్యాలయ గదిలో మహిళలను ఆలింగనం చేయడం, ముద్దులు పెట్టడం వంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలు ఆయన కార్యాలయంలో రహస్యంగా రికార్డు చేసినట్లు సమాచారం. వీడియోల్లో కనిపిస్తున్న మహిళలు వేర్వేరు సందర్భాల్లో, వేర్వేరు దుస్తుల్లో కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. యూనిఫామ్‌లో ఉండగానే ఈ తరహా ప్రవర్తనపై అధికార వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వ కార్యాలయాల వినియోగం, క్రమశిక్షణ, అధికారుల ప్రవర్తనపై అనుమానాలు తలెత్తాయి.
Details
సస్పెన్షన్ ఉత్తర్వులు
వీడియోలు వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. రామచంద్రరావు ప్రవర్తన అశ్లీలంగా ఉందని, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చిందని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకు డా. కె. రామచంద్రరావును తక్షణమే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తోందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సస్పెన్షన్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడదని కూడా ఆదేశించింది.
Details
సీఎం సిద్ధరామయ్య ఏమన్నారంటే?
వీడియోలపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. విచారణ నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని, హోదా లేదా సీనియారిటీని పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. బెలగావిలో మీడియాతో మాట్లాడుతూ, ఈ వీడియో క్లిప్ తన దృష్టికి సోమవారం మాత్రమే వచ్చిందని తెలిపారు. మూడు క్లిప్‌లను కలిపి తయారు చేసిన వీడియోగా అది కనిపిస్తోందన్నారు. ఎంత సీనియర్ అధికారి అయినా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్ సురేష్‌కుమార్ ఈ ఘటనను అవమానకరమైన చర్యగా పేర్కొన్నారు.
Details
రామచంద్రరావు ఎవరు?
ఆర్. రామచంద్రరావు 1993 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి. సస్పెన్షన్‌కు ముందు సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా పనిచేశారు. గతంలో దక్షిణ రేంజ్ ఐజీపీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. త2014లో ఆయన ఐజీపీగా ఉన్న సమయంలో ఒక వివాదాస్పద నగదు స్వాధీనం కేసులో పేరు వినిపించింది. మైసూరు సమీపంలోని యెల్వాల్ వద్ద కాలికట్‌కు వెళ్తున్న ప్రైవేట్ బస్సును పోలీసులు తనిఖీ చేయగా రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే కేరళకు చెందిన వ్యాపారులు అసలు మొత్తం రూ.2.27 కోట్లు అని, పోలీసులే దోచుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రామచంద్రరావు పాత్ర ఉందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆయన మాత్రం అన్ని ఆరోపణలను ఖండించారు.
Details
కుటుంబ నేపథ్యం, పాత ఆరోపణలు
రామచంద్రరావు ప్రముఖ నటి రాన్యారావుకు సతీమాతృ తండ్రి (స్టెప్ ఫాదర్). ఇటీవల వెలుగులోకి వచ్చిన బంగారం స్మగ్లింగ్ కేసులో రాన్యారావుకు సహకరించాడని కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం రాన్యారావు బెంగళూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసు బయటపడిన సమయంలో రామచంద్రరావు కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధిపతిగా ఉన్నారు. అప్పట్లో ఆయనను కంపల్సరీ లీవ్‌పై పంపగా, తర్వాత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించి మళ్లీ డీజీపీగా నియమించింది. రాన్యారావు మాత్రం తన తండ్రికి ఈ స్మగ్లింగ్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.