Hyderabad: హైదరాబాద్ పవర్‌గ్రిడ్ కార్యాలయం వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం .. అటెండెంట్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని కవాడిగూడలో ఉన్న పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయంలో మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్ ఫోన్ అమర్చి వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ఫ్లోర్ అటెండెంట్‌గా పనిచేస్తున్న భరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు సున్నితమైనది కావడంతో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. అక్టోబర్ 13న ఉదయం 10:30 గంటల సమయంలో పవర్‌గ్రిడ్‌లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న ఓ మహిళ ఆరో అంతస్తులోని మహిళల వాష్‌రూమ్‌కు వెళ్లారు. అక్కడ కమోడ్‌కు ఎదురుగా ఉన్న వాష్‌బేసిన్ కింద తెల్ల కాగితంతో కప్పి ఉంచిన వస్తువుకు రెండు రంధ్రాలు కనిపించాయి.
వివరాలు
ఫోల్డర్‌కు పిన్ లాక్
తొలుత దానిని రూమ్ ఫ్రెష్‌నర్‌గా భావించిన ఆమె.. అనుమానంతో పరిశీలించగా గోడకు డబుల్ సైడెడ్ టేప్‌తో అతికించిన మొబైల్ ఫోన్‌ను గుర్తించారు.
ఫోన్‌ను తీసుకుని బయటకు వచ్చిన ఆమె.. అదే అంతస్తులో విధులు నిర్వహిస్తున్న అటెండెంట్ భరత్‌ను ప్రశ్నించారు.
దీంతో అతడు ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించాడు.
ఆమె హెచ్చరించడంతో అప్రమత్తమైన హెచ్‌ఆర్ విభాగం,భద్రతా సిబ్బంది ప్రధాన ద్వారం వద్ద అతడిని పట్టుకున్నారు.
ఫోన్‌లోని వీడియోలను పరిశీలించేందుకు ప్రయత్నించగా.. ఫోల్డర్‌కు పిన్ లాక్ ఉన్నట్లు గుర్తించారు.
పాస్‌వర్డ్ చెప్పాలని ప్రశ్నించడంతో,ఆధారాలు బయటపడకుండా ఉండేందుకు భరత్ ఫోన్‌ను లాక్కుని నేలకేసి కొట్టి ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వివరాలు
భరత్‌ను అరెస్ట్ చేసిన గాంధీనగర్ పోలీసులు
ఆ వాష్‌రూమ్‌ను సుమారు ఆరుగురు మహిళా ఉద్యోగులు ఉపయోగిస్తున్నారని, ఈ ఘటనతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారని బాధితురాలు తెలిపారు.
ధ్వంసమైన ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపి అందులోని సమాచారాన్ని వెలికితీయాలని, ఈ ఘటనలో భరత్‌తో పాటు మరెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని ఆమె కోరారు.
తొలుత గాంధీనగర్ పోలీసులు భరత్‌ను అరెస్ట్ చేయగా.. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 77, 238తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66-E కింద కేసును తిరిగి నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.