LOADING...
President Murmu: రఫేల్‌ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము
రఫేల్‌ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము

President Murmu: రఫేల్‌ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత దేశ ప్రథమ పౌరురాలు,త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపది ముర్ము బుధవారం రఫేల్‌ యుద్ధవిమానంలో గగనయానం చేశారు. హర్యానా రాష్ట్రంలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ఆమె రఫేల్‌ ఫైటర్‌ జెట్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా వాయుసేన చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ స్వయంగా అక్కడ హాజరై ఈ ప్రత్యేక క్షణాన్ని వీక్షించారు. ఈ ఏడాది మే నెలలో భారత్‌ పాకిస్థాన్‌పై నిర్వహించిన 'ఆపరేషన్‌ సిందూర్‌'లో రఫేల్‌ యుద్ధవిమానాలు కీలక పాత్ర పోషించాయి. ఆ సమయంలో ఈ విమానాల సహాయంతో పాకిస్థాన్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సేనలు సర్జికల్‌ దాడులు జరిపాయి. అదే రఫేల్‌లో ఇప్పుడు రాష్ట్రపతి ముర్ము గగనవిహారం చేయడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

తొలి మహిళా రాష్ట్రపతిగా..

ఇక 2023 మే 8న ద్రౌపదీ ముర్ము అస్సాంలోని తేజ్‌పుర్‌ వాయుసేన స్థావరం నుంచి సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానంలో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. యుద్ధవిమానంలో గగనయానం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు పొందారు. అంతకుముందు, 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ కూడా సుఖోయ్‌-30లో గగనయానం చేసిన తొలి మహిళా రాష్ట్రపతిగా నిలిచారు. ఇక 2006లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పుణే వాయుసేన స్థావరం నుంచి ఇదే రకమైన యుద్ధవిమానంలో విహరించిన సంగతి కూడా చారిత్రాత్మకమే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రఫేల్‌ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము