
Medicines Prices Reduced: 37 కీలక ఔషధాల ధరలు తగ్గింపు.. గుండె, షుగర్ మందులపై ఊరట!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) పలువురు రోగులకు ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికి ఊరటగా 37 ముఖ్యమైన ఔషధాల ధరలను 10 నుంచి 15 శాతం మేర తగ్గించినట్లు శనివారం కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తగ్గింపు గుండెజబ్బులు, మధుమేహం, ఇన్ఫెక్షన్లు, విటమిన్ లోపాలు వంటి అనేక వ్యాధులకు ఉపయోగించే ఔషధాలపై వర్తిస్తుంది. తగ్గించిన ఔషధాల్లో పారాసిటమాల్, అటోర్వాస్టాటిన్, అమోక్సిసిలిన్, మెట్‌ఫార్మిన్ వంటి మందులు ఉన్నాయి.
Details
ధరల తగ్గింపుపై ఉపశమనం
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తయారు చేసే ఎసిలోఫెనాక్, పారాసిటమాల్, ట్రెప్సిన్ కైమో ట్రిప్సిన్ కలిపిన టాబ్లెట్ ధరను రూ.13గా నిర్ణయించగా, అదే కాంబినేషన్‌లో క్యాడిలా ఫార్మాసూటికల్స్ కంపెనీ విక్రయించే ఔషధం ధర రూ.15.01గా నిర్ణయించారు. గుండె సంబంధిత సమస్యలకు వాడే ఆటోర్వాస్టాటిన్ (40 mg), క్లోపిడోగ్రెల్ (75 mg) కాంబినేషన్ టాబ్లెట్ ధరను రూ.25.61గా నిర్ణయించారు. విటమిన్ డీ లోపానికి వినియోగించే కోలికాల్సిఫెరాల్ చుక్కలు, చిన్నారులకు ఇచ్చే సెఫిక్సిమ్ ఓరల్ సస్పెన్షన్, డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ (ఒక మిల్లీ లీటర్ రూ.31.77) వంటి మందుల ధరలు కూడా తగ్గాయి.
Details
ఎనిమిది కీలక ఔషధాల ధరల పెంపు
టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగించే ఎంపాగ్లిప్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్ల ఒక్కో టాబ్లెట్‌కు ధరను రూ.16.50కి పరిమితం చేశారు. గతంలో, మే 2024లో కేంద్రం ఎనిమిది కీలక ఔషధాల ధరలను పెంచడానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉబ్బసం, టీబీ, గ్లాకోమా తదితర వ్యాధులకు వాడే ఆ మందుల ధరలను 50 శాతం వరకు పెంచేందుకు ఆమోదం లభించిందట. గతకొంతకాలంగా ఔషధాల ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.