Hindu Rate Of Growth: 'హిందూ వృద్ధిరేటు'పై ప్రధాని మోడీ ఫైర్.. వక్రీకరణపై ఘాటైన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆర్థిక మందగమనాన్ని హిందూ విశ్వాసాలతో అనుసంధానం చేసే ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. 23వ హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 'హిందూ వృద్ధిరేటు' అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి, హిందూ జీవన విధానాన్ని అవమానించేందుకు ఉపయోగించారని మోడీ స్పష్టం చేశారు. ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న భారత ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, గ్లోబల్ స్థాయిలో అనిశ్చితి, విచ్ఛిన్నత పెరుగుతున్నప్పటికీ భారత్ వారధిగా మారుతోందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి మందగమనం దశలో ఉన్నా, భారత్ మాత్రం వృద్ధి కథలను సృష్టిస్తున్నదని చెప్పారు. నమ్మకం తగ్గుతున్న ప్రపంచంలో భారత్ విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని మోడీ వ్యాఖ్యానించారు.
Detais
'హిందూ రేట్ ఆఫ్ గ్రోత్' అంటే ఏమిటి?
'హిందూ రేట్ ఆఫ్ గ్రోత్' అనే పదాన్ని ఆర్థిక శాస్త్రవేత్త రాజ్‌కృష్ణ 1978లో పరిచయం చేశారు. స్వాతంత్య్రం తరువాత 1950ల నుంచి 1980ల వరకూ భారత జీడీపీ వృద్ధిరేటు సగటు 3.5%-4% మధ్యే ఉండేది. ఈ నెమ్మదైన వృద్ధిని సూచించేందుకు ఆయన ఈ పదాన్ని వాడారు. ''తక్కువతో సంతృప్తి పడే హిందూ జీవనశైలి'' వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగలేకపోయిందన్న భావనను ఈ పదం ప్రతిబింబిస్తుంది. అయితే ఈ వ్యాఖ్యానం ఇప్పటి వరకు వివాదానికే కారణమైంది. ఆర్థిక వృద్ధి మందగమనానికి హిందూ సంస్కృతి లేదా జీవన విధానం కాదు, ప్రభుత్వ విధానాలు, అధిక నియంత్రణలు మరియు కఠినమైన నియామకాలు కారణమని పలువురు ఆర్థికవేత్తలు స్పష్టం చేశారు.
Details
ఆర్థిక ప్రగతికి ఆటంకంగా చూపడం అన్యాయం
ఒక మతాన్ని ఆర్థిక ప్రగతికి ఆటంకంగా చూపడం అన్యాయమని విమర్శించారు. 1990ల ఆర్థిక సంస్కరణల తర్వాత భారత్ వృద్ధి పుంజుకుంది. అప్పటి నుంచి 'హిందూ రేట్ ఆఫ్ గ్రోత్' అన్నది చరిత్రలోనే మిగిలిన పదంగా మారింది. అయితే 2023లో మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ భారత్ మళ్లీ ప్రమాదకరంగా అదే వృద్ధిరేటుకు చేరుకుంటోందని వ్యాఖ్యానించడంతో ఈ పదం మరోసారి చర్చకు వచ్చింది. ఈ వ్యాఖ్యలు విమర్శలకు గురయ్యాయి. ఎస్‌బీఐ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ దీనిని తప్పుదారి పట్టించే, పాక్షిక వ్యాఖ్య అని అభివర్ణించారు.