Page Loader
Telangana : భోధనాసుపత్రుల అభివృద్ధికి పునాది.. 44 మంది ప్రొఫెసర్లకు అదనపు డీఎంఈలుగా ప్రమోషన్‌ 
44 మంది ప్రొఫెసర్లకు అదనపు డీఎంఈలుగా ప్రమోషన్‌

Telangana : భోధనాసుపత్రుల అభివృద్ధికి పునాది.. 44 మంది ప్రొఫెసర్లకు అదనపు డీఎంఈలుగా ప్రమోషన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

బోధనాసుపత్రులను బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 44 మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏడీఎంఈ) పదోన్నతులు మంజూరు చేసింది. ఈయనలలో 23 మందిని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లుగా, మిగతా 21 మందిని బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లుగా నియమిస్తూ మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 2021లో ఇదే తరహా ఏడీఎంఈ పదోన్నతులు జరిగాయి. అయితే అప్పట్లో 18 మందితో జాబితా విడుదల చేసినా, కొందరు తాము కోరిన ప్రాంతాల్లో పోస్టింగ్‌లు లేవని పదోన్నతిని తిరస్కరించారు. అప్పటి నుంచే ఈ పదోన్నతుల కోసం అనేక మంది అర్హులైన వారు ఎదురుచూస్తున్నారు.

వివరాలు 

వైద్య విద్యకు నూతన ప్రోత్సాహం 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ యూజీ వైద్య కళాశాలలు ఉన్నాయి. అయితే వీటిలో చాలాచోట్ల రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్ల అభావం వల్ల కీలక నిర్ణయాల తీసుకునే ప్రక్రియ కష్టతరంగా మారింది. కొత్తగా ఏర్పాటైన కళాశాలలు ఎక్కువగా ఉండటంతో మౌలిక వసతులు సరిగ్గా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి సందర్భంలో రెగ్యులర్‌ పోస్టింగ్‌లు ఇవ్వడం ద్వారా కళాశాలలు, బోధనాసుపత్రులు సక్రమంగా నడిచే అవకాశాలు పెరిగాయి. కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఎస్‌.సంధ్యకు ఏడీఎంఈ పదోన్నతిలో భాగంగా కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్‌ పోస్టును భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నాగార్జునరెడ్డి వర్సిటీలో ఇన్‌ఛార్జ్‌ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు.

వివరాలు 

అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధం 

ఈ శాఖలో అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 278 మందికి ప్రొఫెసర్‌ పదోన్నతులు ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. వీరి పోస్టింగ్‌ల కేటాయింపుపైనా వైద్య ఆరోగ్యశాఖ గట్టిగా కసరత్తు చేస్తోంది.అదేవిధంగా,అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా ఉన్న సుమారు 231 మందిని అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులిచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌,ప్రొఫెసర్‌,అడిషనల్‌ డీఎంఈ వంటి హయ్యర్‌ పోస్టులకు నేరుగా నియామకాలు చేయడం సాధ్యం కాకపోవడంతో, పదోన్నతుల ద్వారానే ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తోంది.

వివరాలు 

అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధం 

ఇటీవల మెడికల్‌, హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ద్వారా 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నేరుగా భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇక దీనికి తోడు మరో 714 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలు పూర్తయ్యే సరికి, ప్రభుత్వ వైద్య విద్యా రంగంలోని ప్రధాన ఖాళీలన్నీ భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.