నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్
పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ (ప్రత్యేక హక్కుల తీర్మానం) ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 9న మోషన్ ఆఫ్ ధన్యవాదంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కేసీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నెహ్రూ ఇంటిపేరు పెట్టుకోవడానికి ఆయన వంశంలోని వారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని మోదీ అన్నారు. నెహ్రూ ఇంటిపేరు పెట్టుకోవడానికి ఎందుకు అవమానంగా భావిస్తున్నారని ప్రశ్నించారు.
తండ్రి ఇంటిపేరును కూతురు తీసుకోదనే విషయం ప్రధానికి తెలుసు: వేణుగోపాల్
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సోనియా గాంధీలను లక్ష్యంగా చేసుకుని మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన వేణుగోపాల్ పేర్కొన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలు అవమానకరమైనవి మాత్రమే కాకుండా నెహ్రూ కుటుంబ సభ్యులను ముఖ్యంగా లోక్‌సభ సభ్యులుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కించపరిచేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. తండ్రి ఇంటిపేరును కూతురు(ఇందిరాగాంధీ) తీసుకోదనే విషయం ప్రధానికి ఆ రోజు బాగా తెలుసని వేణుగోపాల్ వివరించారు. ఇది తెలిసినప్పటికీ ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేసారని మరింత వివరించాల్సిన అవసరం లేదని చెప్పారు. నెహ్రూ కుటంబంపై మోదీ అన్న మాటలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అధికారాలను ఉల్లంఘించడంతో పాటు వారి సభా హక్కులను ధిక్కరించడంతో సమానమని వేణుగోపాల్ అన్నారు.