లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్‌లో జరుగుతున్న రెండో విడత బడ్జెట్ సమావేశాలు శుక్రవారం కూడా గందరగోళంగా మారాయి. లండన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంట్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభ నుంచి సస్పెండ్ చేయాలని, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ప్యానెల్‌కు నోటీసును అందచేశారు.
ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతో సహా రాజకీయ నాయకులపై గూఢచర్యం జరుగుతోందని ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ వివాదం, నరేంద్ర మోదీపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) డాక్యుమెంటరీ వంటి సమస్యలపై ఆయన లండన్‌లో ప్రస్తావించారు.
పార్లమెంట్
అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం
బ్రిటన్‌లో రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించి లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. అదానీ కేసుపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పవద్దని, గౌతమ్ అదానీ కేసులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
బీజేపీ రాహుల్ వ్యాఖ్యలకు వ్యవతరేకంగా, కాంగ్రెస్ ఆదాని వ్యవహరంపై నినాదాలు చేయడంతో ఉభయ సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నారు.
దీంతో ఉభయ సభలను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు.