లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రసంగంపై పార్లమెంట్ లో బుధవారం కూడా ప్రతిపక్షాలు- అధికార పార్టీ బీజేపీ మధ్య రగడ కొనసాగుతోంది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా రాహుల్ విదేశాల్లో చేసిన ప్రసంగానికి దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తారని ఆమె అన్నారు.
పార్లమెంట్ అంటే భారత ప్రజల సమిష్టి స్వరం: స్మృతి ఇరానీ
రాహుల్ గాంధీ భారత పార్లమెంటుకు క్షమాపణలు చెప్పాలని ప్రతి భారతీయ పౌరుడు డిమాండ్ చేస్తున్నాడని, ఇది కేవలం పార్లమెంటు సభ్యుల సమ్మేళనం కాదని, భారత ప్రజల సమిష్టి స్వరం అన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. భారత ప్రజల అభీష్టానికి రాజ్యాంగ ప్రతిబింబం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై మంగళవారం పార్లమెంట్ దద్దరిల్లింది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం కారణంగా మంగళవారం పార్లమెంటు రోజంతా వాయిదా పడింది. గాంధీ యూకేలో చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ పట్టుబట్టింది. బీజేపీ పార్లమెంటును అవమానించిందని, క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బుధవారం కూడా లోక్ సభ, రాజ్యసభలో అదే గందరగోళం కొనసాగుతోంది.