LOADING...
Rambilli: రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ.. రూ. 2,300 కోట్ల పెట్టుబడి.. 1750 మందికి ఉద్యోగ అవకాశాలు
1750 మందికి ఉద్యోగ అవకాశాలు

Rambilli: రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ.. రూ. 2,300 కోట్ల పెట్టుబడి.. 1750 మందికి ఉద్యోగ అవకాశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో భారీ స్థాయి ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయి. జాతీయ స్థాయిలో పేరున్న బ్లూజెట్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ సంస్థ పరిశ్రమ స్థాపనకు ముందుకు రావడంతో, ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో రెండో విడతగా సేకరించిన భూముల్లో ప్రభుత్వం 102.48 ఎకరాలను కేటాయించింది. ఎకరాకు రూ.40 లక్షల చొప్పున భూమిని మంజూరు చేస్తూ, నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంలో భాగంగా పలు రాయితీలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.2,300 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ పరిశ్రమకు రాంబిల్లి మండలం జెడ్‌.చింతువ రెవెన్యూ పరిధిలోని సీతపాలెం ప్రాంతంలో స్థలాన్ని కేటాయించారు. ఈ పరిశ్రమను మొత్తం మూడు దశల్లో పూర్తి చేయాలని యాజమాన్యం ప్రణాళిక రూపొందించింది.

వివరాలు 

28న మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

తొలి దశను జులై 2027 నాటికి, రెండో దశను ఏప్రిల్‌ 2030 నాటికి, మూడో దశను అక్టోబరు 2031 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమ ప్రారంభంతో ప్రత్యక్షంగా 1,750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఏపీఐఐసీ అధికారులు సుమారు రూ.10 కోట్ల వ్యయంతో 1.4 కిలోమీటర్ల పొడవున, వంద అడుగుల వెడల్పుతో రహదారి నిర్మిస్తున్నారు. అదే నిధులతో రోజుకు 2,700 కిలోలీటర్ల నీటి సరఫరాకు అవసరమైన పైపులైన్‌ పనులు కూడా చేపడుతున్నారు. పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు లభించడంతో, ఈ నెల 28న మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని పరిశ్రమ యాజమాన్యం నిర్ణయించింది.

Advertisement