Ravi River: వేసవికి ముందే.. పాకిస్థాన్ కు రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌కు దశాబ్దాలుగా వృథాగా వెళ్లిపోతున్న రావి నది మిగులు నీటిని ఇక పూర్తిగా అడ్డుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది. పంజాబ్-జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో నిర్మిస్తున్న షాపుర్‌కండి బ్యారేజీ పనులు తుది దశకు చేరుకున్నాయని, మార్చి 31 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని జమ్మూ కశ్మీర్ జలవనరుల శాఖ మంత్రి జావేద్ అహ్మద్ రాణా వెల్లడించారు. ఈ బ్యారేజీ అందుబాటులోకి రాగానే రావి నది నుంచి పాకిస్థాన్ వైపు వెళ్లే నీరు పూర్తిగా నిలిచిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
ఈ ప్రాజెక్టు ద్వారా 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ఈ బ్యారేజీ ద్వారా నిల్వయ్యే నీటిని జమ్మూ కశ్మీర్‌లోని కరువు ప్రభావిత ప్రాంతాలైన కతువా, సాంబా జిల్లాల్లో ఉన్న 32,173 హెక్టార్ల వ్యవసాయ భూములకు మళ్లించనున్నారు. అలాగే పంజాబ్‌లో సుమారు 5,000 హెక్టార్ల సాగుభూమికీ ఈ నీటి వల్ల లాభం చేకూరనుంది. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టు ద్వారా 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఇప్పటివరకు భారత్ వినియోగించుకోని ఈ నీరు వృథాగా పాకిస్థాన్‌కు వెళ్లేదని, ఇకపై ఆ నీటిని దేశ రైతుల అవసరాల కోసం పూర్తిగా ఉపయోగించుకుంటామని మంత్రి రాణా తెలిపారు.
వివరాలు
2018లో కేంద్ర ప్రభుత్వ జోక్యంతో పనులు మళ్లీ మొదలయ్యాయి
1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి నదిపై భారత్‌కు సంపూర్ణ హక్కులు ఉన్నాయని అధికారులు గుర్తుచేశారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 1982లోనే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ శంకుస్థాపన చేసినప్పటికీ, పంజాబ్,జమ్మూ కశ్మీర్ మధ్య ఏర్పడిన వివాదాల కారణంగా ఇది ఎన్నో సంవత్సరాల పాటు నిలిచిపోయింది. చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వ జోక్యంతో పనులు మళ్లీ మొదలయ్యాయి. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌పై కఠినంగా వ్యవహరించాలనే వ్యూహంలో భాగంగానే ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని భారత్ నిర్ణయించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.