ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
ఇటీవల లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే బీజేపీ నాయకుల తీరుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే, నాశనం చేసే వారు దానిని రక్షించడం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్నారని ఆరోపించారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ పై విమర్శలు గుప్పించారు.
అదానీ స్టాక్స్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలి: ఖర్గే
అదానీ స్టాక్స్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలని తాము డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. తాము ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు మైకులు బంద్ చేశారని, సభలో గందరగోళం చెలరేగిందన్నారు. విదేశీ గడ్డపై భారత్‌ను విమర్శించడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. అయితే గతంలో ప్రధాని మోదీ చైనా, దక్షిణ కొరియాలో చేసిన ప్రసంగాలను ఖర్గే ట్వీట్ చేశారు. చైనా, దక్షిణ కొరియాలో మోదీ చేసిన ఈ ప్రసంగాలు భారత దేశానికి అవమానకరం కాదా? అని ప్రశ్నించారు.