Pinarayi Vijayan: పినరయి విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ అధికారుల వాహనాలపై సీపీఎం కార్యకర్తల దాడి
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి,సీపీఎం ప్రముఖ నాయకుడు పినరయి విజయన్ అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎంఆర్‌ఎల్-ఎక్సాలాజిక్ ఆర్థిక వ్యవహారాల కేసులో భాగంగా ఈడీ అధికారులు విజయన్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. సోదాలు పూర్తి చేసి అధికారులు వాహనాల్లో అక్కడి నుంచి బయలుదేరుతుండగా,అప్పటికే పెద్ద సంఖ్యలో చేరుకున్న సీపీఎం కార్యకర్తలు,అభిమానులు వారిని అడ్డుకున్నారు. ఆగ్రహానికి లోనైన కార్యకర్తలు కర్రలు,రాళ్లతో ఈడీ అధికారుల వాహనాలపై దాడికి దిగారు. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనాల అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. దాడి సమయంలో గాజు ముక్కలు తగలడంతో ఒక వాహన డ్రైవర్ కంటికి తీవ్ర గాయమైంది.
వివరాలు
పోలీసుల తీరుపై విమర్శలు, పలువురు నిరసనకారుల అరెస్ట్
మరో డ్రైవర్‌తో పాటు కేంద్ర భద్రతా సిబ్బంది, కొందరు పోలీసులు కూడా స్వల్ప గాయాలకు గురయ్యారు. సీపీఎం సీనియర్ నాయకులు అక్కడే ఉన్నప్పటికీ కార్యకర్తలు హింసాత్మకంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఘటన సమయంలో పోలీసులు వెంటనే జోక్యం చేసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో ఈడీ అధికారులు అక్కడి నుంచి బయటపడి సమీప పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునే చర్యలు ప్రారంభించారు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు కొందరు కార్యకర్తలు సమీపంలోని పార్టీ కార్యాలయంలోకి పరుగులు తీశారు. పోలీసులు ఆ కార్యాలయాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనతో కేరళ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.