LOADING...
Telangana: మామిడి తోటల దిగుబడులకు ప్రూనింగ్‌ అవసరం 
మామిడి తోటల దిగుబడులకు ప్రూనింగ్‌ అవసరం

Telangana: మామిడి తోటల దిగుబడులకు ప్రూనింగ్‌ అవసరం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఉద్యాన పంటల్లో మామిడి ఒకటి. ఈ పంట సాగు విస్తృతంగా పెరుగుతున్నప్పటికీ, దిగుబడుల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. అంతేకాక, కొద్దిమేర కాయల నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేకపోవడం వల్ల విదేశీ ఎగుమతులపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి ఒక సమర్థవంతమైన మార్గంగా ప్రూనింగ్‌ అనే కొమ్మల కత్తిరింపు ప్రక్రియను అనుసరించాలని ఉద్యానశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అధిక దిగుబడి, మెరుగైన కాయ నాణ్యత కోసం ఇది కీలక పాత్ర పోషిస్తుందని, ప్రస్తుతం ఈ ప్రక్రియ చేపట్టేందుకు అనుకూలమైన కాలమని వారు చెబుతున్నారు.

వివరాలు 

దిగుబడిని తగ్గిస్తున్న కొమ్మల అంతరాయం 

మామిడి చెట్లు విస్తారంగా పెరిగి, వాటి కొమ్మలు ఒకదానితో ఒకటి మిళలిపోతున్నాయి. పక్కపక్కన ఉన్న చెట్ల కొమ్మలు కలిసిపోతూ, ఒకదానిపై మరొకటి రాసుకుంటూ పెరుగుతున్నాయి. దీనివల్ల చెట్లకు తగిన కాంతి, గాలి అందక దిగుబడి తగ్గుతోంది. చెట్టు కింది భాగంలోని కొమ్మలకు సూర్యకాంతి అందకపోవడం వల్ల చీడపీడల బారి ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావంగా కాయల నాణ్యతపై కూడా ప్రతికూలంగా ప్రభావం చూపుతోంది.

వివరాలు 

ప్రూనింగ్‌ ఎలా చేయాలి ? 

పది సంవత్సరాల పైబడిన మామిడి తోటల్లో ప్రతి రెండు సంవత్సరాలకోసారి కాయలు కోత పూర్తైన తర్వాత చల్లని వాతావరణంలో ప్రూనింగ్‌ చేయాలి. ఈప్రక్రియలో కాంతిని అడ్డుకొనే అధిక కొమ్మలను తొలగించి,చెట్టు లోపలికి గాలి,వెలుతురు సులభంగా ప్రవేశించేలా చేయాలి. ప్రతి కొమ్మపై సూర్యకాంతి పడేలా ఏర్పాటు చేయడం ముఖ్యం.ప్రత్యేకంగా ఎండు కొమ్మలు,చీడపీడల ప్రభావానికి లోనైన కొమ్మలు మొదళ్ల దాకా కత్తిరించాలి. చెట్టు దిగువ భాగంలోని కొమ్మలను మూడడుగుల లోపల (మూల ఎత్తు వరకూ)మాత్రమే తొలగించాలి. దీని వల్ల ఆ కింది భాగాలకు పుష్పం బాగా వచ్చి, కాయల కాపు ఎక్కువగా ఉంటుంది. కొమ్మలు కత్తిరించిన వెంటనే వాటి చివరలు బాగా ఎండిపోకుండా ఉండేందుకు,బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ పేస్టును రాసి పెట్టాలి.

వివరాలు 

మామిడి సాగు విస్తృతి 

ఒకేసారి ఎక్కువ కొమ్మలు తొలగిస్తే, పై మిశ్రమాలను ద్రావణంగా తయారు చేసి చెట్టంతటా పిచికారీ చేయాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 3.32 లక్షల హెక్టార్లలో, తెలంగాణలో 1.80 లక్షల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. ఉత్పత్తి పరంగా ఈ రెండు రాష్ట్రాలు దేశంలో వరుసగా మూడో మరియు నాలుగో స్థానాల్లో ఉన్నాయి. అంతేకాదు, ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం పండ్ల ఉత్పత్తిలో 68 శాతం వరకు మామిడికాయలే ఉన్నాయి.