Pulivendula: పులివెందులలో మెగా వాటర్‌గ్రిడ్‌కు పునరుజ్జీవం.. రూ.280 కోట్లు కేటాయింపు.. 96% పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్ (జేజేఎం) కింద ప్రారంభించి మధ్యలోనే నిలిచిపోయిన మెగా వాటర్‌గ్రిడ్ పథకం పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి కోసం రూ.280 కోట్లు కేటాయించిందని, ఇప్పటివరకు 96 శాతం పనులు పూర్తయ్యాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పులివెందుల, సింహాద్రిపురం మండలాల్లో ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రజలకు తాగునీరు అందుతున్నట్లు పవన్‌కల్యాణ్ వెల్లడించారు. లింగాల మండల పరిధిలోని 27 గ్రామాల్లో 24 గ్రామాలకు త్వరలో నీటి సరఫరా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
వివరాలు
1,106 కిలోమీటర్ల పనులు పూర్తి
ప్రాజెక్టులో కీలకమైన ఇన్‌టేక్ వెల్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని పవన్ చెప్పారు.
రోజుకు 6.5 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యమున్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు.
మొత్తం 1,111 కిలోమీటర్ల మేర చేపట్టిన పైప్‌లైన్ పనుల్లో 1,106 కిలోమీటర్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు.
ఓవర్‌హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ల నిర్మాణ పనులు కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
పులివెందుల నగరానికి సంబంధించిన వాటర్‌గ్రిడ్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
వివరాలు
చేపట్టిన పనుల్లోనూ నాణ్యత లోపాలు
కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ కోసం నిధులు కేటాయించినప్పటికీ, గత వైకాపా ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే రూ.480 కోట్ల మెగా వాటర్‌గ్రిడ్ పథకంపై తగిన శ్రద్ధ చూపలేదని పవన్‌కల్యాణ్ ఆరోపించారు.
అప్పట్లో చేపట్టిన పనుల్లోనూ నాణ్యత లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.
జేజేఎం-అమరజీవి జలధార పథకాల కింద చేపడుతున్న తాగునీటి ప్రాజెక్టులను రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్తున్నామని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.
ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.