
Pune: పూణెలో తీవ్ర విషాదం.. ఆఫీస్ అంతస్తు నుంచి దూకి ఇంజనీర్ ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
పూణే నగరంలోని హింజెవాడి ఐటీ పార్క్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. 23 ఏళ్ల వయసున్న పియూష్ అశోక్ కవాడే అనే యువకుడు తన కార్యాలయ భవనం పైనుంచి దూకి ప్రాణాలు విడిచాడు. అతడు గత సంవత్సరం జూలై నెల నుంచి అట్లాస్ కాప్కో(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆఫీస్‌లో సమావేశం జరుగుతుండగా, అకస్మాత్తుగా పియూష్ ఆ సమావేశం నుంచి బయటకు వెళ్లి, భవనం పై అంతస్తు నుండి కిందకు దూకేశాడు. ఈ సంఘటన వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్నవారు షాక్‌కు గురయ్యారు.
వివరాలు
నోట్‌లోని వివరాలను పూర్తిగా అధ్యయనం చేస్తున్నాం: అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పియూష్ సూసైడ్ నోట్‌ను వదిలిపెట్టి తన ప్రాణాలు తీసుకున్నాడు. ఆ నోట్‌లో పొందుపరిచిన విషయాల ఆధారంగా విచారణను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ కురాడే మాట్లాడుతూ.. పియూష్ పనితో సంబంధించి ఎలాంటి ఒత్తిడి విషయాలు ఆ సూసైడ్ నోట్‌లో లేవని తెలిపారు. అయితే, నోట్‌లోని వివరాలను పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతానికి ఈ కేసును ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇదే సమయంలో, ఈ యువకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన అసలు కారణాలను నిశితంగా అన్వేషిస్తున్నామని తెలిపారు.