Punjab: పంజాబ్‌లో మూడు సిక్కు పవిత్ర నగరాల్లో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌లో కొత్తగా పవిత్ర నగరాలుగా ప్రకటించిన మూడు సిక్కు పట్టణాల్లో మాంసం, మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించింది. మాంసం, మద్యం, పొగాకు, ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు ఇకపై అనుమతించబోవని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పీటీఐ కథనం ప్రకారం, ఈ నిషేధం అమలులోకి వచ్చింది. పవిత్ర నగరాల జాబితాలో అమృత్‌సర్ వాల్డ్ సిటీ, తల్వండి సాబో, శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్ ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆదివారం వీడియో సందేశం ద్వారా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సీఎం మాన్ తెలిపారు.
వివరాలు
డిసెంబర్ 15న అధికారికంగా నోటిఫికేషన్ జారీ
గత నెలలో పంజాబ్ శాసనసభ ఈ మూడు పట్టణాలకు 'పవిత్ర నగర' హోదా ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గురు తేగ్ బహదూర్ 350వ శహీద్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత డిసెంబర్ 15న అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసి పవిత్ర నగర హోదాను ప్రకటించారు. వీడియో సందేశంలో సీఎం మాన్ మాట్లాడుతూ,సిక్కు మతానికి చెందిన ఐదు తఖ్తులు ఉన్నాయని, వాటిలో మూడు పంజాబ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. అమృత్‌సర్‌లోని శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్,బతిండా జిల్లాలోని తల్వండి సాబోలో ఉన్న శ్రీ దమ్దమా సాహిబ్,శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని తఖ్త్ శ్రీ కేశ్‌గఢ్ సాహిబ్ ఇవి పంజాబ్‌లో ఉన్న ముఖ్య తఖ్తులని వివరించారు.
వివరాలు
పవిత్ర నగరాలు పంజాబ్ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకలు: సీఎం
ఈ పవిత్ర నగరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందని సీఎం మాన్ హామీ ఇచ్చారు. ఈ-రిక్షాలు,మినీ బస్సులు,షటిల్ బస్ సేవలను ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలను సులభతరం చేస్తామని తెలిపారు. పవిత్ర నగరాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా, పంజాబ్ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకలని సీఎం మాన్ అన్నారు. వాటి పవిత్రతను,ప్రాముఖ్యతను కాపాడేలా అభివృద్ధి చేపడతామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో మాంసం,మద్యం,పొగాకు,ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై పూర్తిస్థాయి నిషేధం అమలులో ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. సిక్కు మతానికి చెందిన ఐదు తఖ్తులు అత్యున్నత ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండటంతో పాటు,సిక్కు గురువులతో ముడిపడ్డ గొప్ప చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.