Farmers Protest: ఢిల్లీలో రైతుల మహా పంచాయత్.. భారత్-అమెరికా ఒప్పందంపై ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌కు చెందిన వందలాది మంది రైతులు ఢిల్లీలోకి చేరుకున్నారు. కిసాన్ ఘాట్‌లో నేడు దేశ్ బచావో మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న'మహా పంచాయత్'లో వారు పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 550 రైతు సంఘాలు,సామాజిక సంస్థలు ఈ నిరసనకు మద్దతుగా హాజరవుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే భారత రైతులు, వ్యవసాయ కూలీలు,చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్‌సీ) నేత జర్మన్‌జిత్ సింగ్ బండాల ఆరోపించారు. అమెరికాలో భారీ ప్రభుత్వ సబ్సిడీలతో వేలాది ఎకరాల్లో వ్యవసాయం జరుగుతుండగా, భారతదేశంలో ఎక్కువ మంది రైతుల వద్ద కేవలం 2 నుంచి 2.5 ఎకరాల భూమి మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు.
వివరాలు
దేశీయ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం
ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి తక్కువ ధరలకు వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ మార్కెట్‌లోకి వస్తే, చిన్న రైతులు వాటితో పోటీ పడే అవకాశం ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందం వల్ల దేశీయ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఈ వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకొస్తోందని జర్మన్‌జిత్ సింగ్ బండాల విమర్శించారు.
వ్యవసాయ రంగంతో పాటు చిన్న వ్యాపారాలు, ఇతర రంగాల్లోని ఉద్యోగాలపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.