Virtual G20 Summit: నేడు మోదీ అధ్యక్షతన G20 వర్చువల్ సమ్మిట్.. జిన్‌పింగ్ గైర్హాజరు
దిల్లీ డిక్లరేషన్‌ను అమలు చేయడం, ప్రపంచ కొత్త సవాళ్లకు పరిష్కారాలను కనుకొనేందుకు అవసరమైన చర్చలే లక్ష్యంగా బుధవారం సాయంత్రం వర్చువల్ G20 లీడర్స్ సమ్మిట్ జరగబోతోంది. ఈ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. అన్ని G20 సభ్య దేశాల నాయకులు, ఆఫ్రికన్ యూనియన్, తొమ్మిది అతిథి దేశాల ప్రతినిధులు, 11 అంతర్జాతీయ సంస్థల అధినేతలకు ఇప్పటికే ఆహ్వానాలను పంపారు. సెప్టెంబరులో భారత్ అధ్యక్షతన దిల్లీలో G20 వార్షిక శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే. దిల్లీ సమ్మిట్‌లో కీలక తీర్మానాలను ఆమోదించారు. ఆ సమ్మిట్‌లో తీసుకున్న నిర్ణయాలు.. వాటి ఫలితాలపై వర్చువల్ సమ్మిట్ ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు
సమ్మిట్ ఎజెండాలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వివాదం, ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక పునరుద్ధరణపై వాటి ప్రభావం అంశాలు ఉండే అవకాశం ఉంది. సమ్మిట్‌లో సభ్య దేశాల నాయకుల నుంచి అద్భుతమైన భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నట్లు భారత G20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. ఈ వర్చువల్ సమ్మిట్‌కు కూడా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. ఆయనకు బదులుగా లీ కియాంగ్ చైనాకు ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే వర్చువల్ సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రకటించింది. సాయంత్రం 5.30 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఒక సమావేశంలో పుతిన్, బిడెన్ పాల్గొనడం ఇదే తొలిసారి.