LOADING...
Putin's visit: పుతిన్ పర్యటన, డిసెంబరు వార్షికోత్సవాల నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్..
పుతిన్ పర్యటన,డిసెంబరు వార్షికోత్సవాల నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్..

Putin's visit: పుతిన్ పర్యటన, డిసెంబరు వార్షికోత్సవాల నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

పుతిన్ పర్యటన, డిసెంబర్ వార్షికోత్సవాల నేపథ్యంలో తీవ్ర భద్రతా హెచ్చరికలతో దేశ రాజధాని దిల్లీలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాద హెచ్చరికలు, అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5తేదీల్లో ఢిల్లీకి రానుండటంతో నగరమంతా బహుస్థాయి భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే నవంబర్ ప్రారంభం నుంచే అలర్ట్ అమల్లో ఉండగా,డిసెంబర్ 4-5 పుతిన్ పర్యటన, డిసెంబర్ 6 బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం,డిసెంబర్ 13 పార్లమెంట్ దాడి వార్షికోత్సవాల నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఈ పరిస్థితుల్లో నిషేధిత సంస్థ'సిక్ఖ్స్ ఫర్ జస్టిస్'చీఫ్ గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్"డిసెంబర్ 13ను కాశ్మీర్-ఖాలిస్థాన్ ఫ్రీడం డేగా జరుపుకుంటాం"అంటూ వీడియో సందేశం విడుదల చేయడంతో అలర్ట్ మరింత పెరిగింది.

వివరాలు 

 ఢిల్లీలో అతిథులు బస చేసే హోటళ్ల దగ్గర అత్యాధునిక మోషన్ సెన్సార్ కెమెరాలు ఏర్పాటు  

అదే సందేశంలో పార్లమెంట్‌పై దాడికి పిలుపునిస్తూ, కొందరు ఎంపీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు అధికారులు తెలిపారు. పుతిన్ పర్యటన నేపథ్యంలో డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలు మోహరించగా, ప్రత్యేక బృందాలు గగనతల, సిగ్నల్ స్థాయిలో రష్యన్ ప్రతినిధుల కదలికలను పర్యవేక్షిస్తున్నాయి. మొదట రష్యా భద్రతా బలగాలు పర్యటన ఏర్పాట్లు చూసుకోగా, ఆ తరువాత భారత ఎన్ఎస్‌జీ, రక్షణ దళాలు భద్రత బాధ్యతలు తీసుకోనున్నాయి. లూటియన్స్ ఢిల్లీలో అతిథులు బస చేసే హోటళ్లన్నీ పూర్తిగా తనిఖీ చేసి, అత్యాధునిక మోషన్ సెన్సార్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాకపోకలపై ఆంక్షలు విధించడంతో గురువారం, శుక్రవారాల్లో భారీ ట్రాఫిక్ అంతరాయాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

వివరాలు 

నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో పేలుడు 

నవంబర్ 10న పేలుడు పదార్థాలతో ఉన్న కారు కానాట్ ప్లేస్, ఇండియా గేట్ వంటి హై సెక్యూరిటీ ప్రాంతాల గుండా వెళ్లి ఎర్రకోట సమీపంలో పేలిన ఘటన భద్రతా లోపాలను బయటపెట్టింది. ఆ ఘటనకు సంబంధించి ఢిల్లీ, కాశ్మీర్, గుజరాత్‌లలో పట్టుబడిన అనుమానితుల విచారణలో అజాద్‌పూర్, పహార్‌గంజ్ వంటి రద్దీ మార్కెట్లు, కీలక కేంద్రాలను ముందుగానే రెక్కీ చేసినట్టు తేలింది. దీంతో మెట్రో కేంద్రాలు, మార్కెట్లు, మాల్స్, ఆరాధనా స్థలాలు సహా జనసందడి ఉండే అన్ని చోట్ల భద్రతను భారీగా పెంచారు.

Advertisement

వివరాలు 

ఎమర్జెన్సీ నంబర్ 112కి సమాచారం

పోలీస్ ఉన్నతాధికారులు గూఢచారి సంస్థలతో సమన్వయంలో ప్రతి సమాచారం చెక్ చేస్తూ నగరమంతా అదనపు బలగాలను మోహరించామని చెప్పారు. ఇందులో యూనిఫామ్‌లోను, సాదా దుస్తుల్లోను మహిళా సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ప్రజల్లో నమ్మకం పెంచడం, కట్టుదిట్టమైన పర్యవేక్షణతో ప్రధాన ప్రాంతాలన్నింటిలో భద్రత పటిష్టం చేయడమే లక్ష్యమన్నారు. సీసీటీవీ పర్యవేక్షణను అధికారులు మరింత పెంచగా, ఎవరికైనా అనుమానాస్పద కదలికలు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే ఎమర్జెన్సీ నంబర్ 112కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement