Loading...
Chandrababu: చెత్తకు చెక్.. అక్టోబర్ 2లోపు ఏపీని స్వచ్ఛ రాష్ట్రంగా మారుస్తాం: చంద్రబాబు
చెత్తకు చెక్.. అక్టోబర్ 2లోపు ఏపీని స్వచ్ఛ రాష్ట్రంగా మారుస్తాం: చంద్రబాబు

Chandrababu: చెత్తకు చెక్.. అక్టోబర్ 2లోపు ఏపీని స్వచ్ఛ రాష్ట్రంగా మారుస్తాం: చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్టోబర్ 2 నాటికి చెత్తలేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గుడివాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, గుంటూరు, నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణ కోసం వినియోగించనున్న ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి పురస్కారాలు కూడా అందజేశారు. ప్రతి కుటుంబం తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి ఇవ్వాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛత సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు

వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా 1,140 ఈ-ఆటోలు అందుబాటులోకి

అలాగే ఆగస్టు 26 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,140 ఈ-ఆటోలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కోసం 108 సమగ్ర ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.528 కోట్లు వ్యయం చేస్తున్నామని చెప్పారు.

అదే విధంగా 'ప్రజారథం' కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి చెత్తను కొనుగోలు చేసి, దానికి బదులుగా నిత్యావసర వస్తువులను అందిస్తున్నామని, ఈ పథకం కోసం ఇప్పటివరకు రూ.16 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అలాగే ప్రతి ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకుని, తమ అవసరాలకు తామే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే దిశగా ప్రజలు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

ADVERTISEMENT