QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 'ఐఐటీ బాంబే'- టాప్-150లో చోటు
2023-24 ఏడాదికి సంబంధించిన QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఈ ఏడాది ఐఐటీ బాంబే 149ర్యాంక్ సాధించింది. తద్వారా తొలిసారిగా ఐఐటీ బాంబే టాప్ 150లో చేరింది. యూకే ఆధారిత ర్యాంకింగ్ ఏజెన్సీ క్వాక్వారెల్లి సైమండ్స్(QS) ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. అలాగే ఈ ఏడాది టాప్ 500లో దిల్లీ యూనివర్సిటీ(407), అన్నా యూనివర్సిటీ(427) చోటు దక్కించుకున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) బెంగళూరు గతంలో 2016లో 147 ర్యాంకింగ్‌తో ఈ ఘనతను సాధించింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మరో భారతీయ విద్యా సంస్థ టాప్ 150 జాబితాలో చేరడం ఇదే మొదటిసారి. ఐఐటీ బాంబే ఈ సంవత్సరం 51.8 స్కోర్‌తో 149వ ర్యాంక్‌ను సాధించడం ద్వారా విశేషమైన విజయాన్ని సాధించింది.
23 స్థానాలు ఎగబాకి ఐఐటీ బాంబే
ఈ ఏడాది ఏకంగా 23 స్థానాలు ఎగబాకి ఐఐటీ బాంబే ప్రపంచవ్యాప్తంగా 149వ ర్యాంక్‌ను సాధించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) బెంగళూరు 155వ ర్యాంక్ నుంచి 225 ర్యాంకు దిగజారింది. గత సంవత్సరం అత్యుత్తమ భారతీయ సంస్థతో పోలిస్తే ఇప్పుడు మూడో అత్యధిక ర్యాంక్ పొందిన భారతీయ సంస్థగా నిలిచింది. అదేవిధంగా ఐఐటీ దిల్లీ 174 నుంచి 197కి, ఐఐటీ కాన్పూర్ 264 నుంచి 278కి, ఐఐటీ మద్రాస్ 250 నుంచి 285కి పడిపోయాయి. స్థిరత్వం, ఉపాధి ఫలితాలు, అంతర్జాతీయ పరిశోధన నెట్‌వర్క్ ఆధారంగా QS సంస్థ ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించింది.
సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి: ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ సుభాసిస్ చౌధురి
QS ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ బాంబే సాధించిన విజయాల గురించి ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, ప్రొఫెసర్ సుభాసిస్ చౌధురి స్పందించారు. ఉత్తమ బోధన, పరిశోధన వల్ల ఇది సాధ్యమైందన్నారు. తమ విద్యార్థులు, అధ్యాపకులకు అనుకూలమైన వాతావరణంతో పాటు మౌలిక సదుపాయాలను అందించడంలో తాము చేసిన కృషి వల్లే ఈ ర్యాంకు వచ్చినట్లు చెప్పారు. అయితే ఐఐటీ బాంబే సాంధించాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 20వ ఎడిషన్‌ను మంగళవారం అర్థరాత్రి విడుదల చేశారు.