QUAD meet: కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్స్‌పై భారత్-అమెరికా కీలక ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, అమెరికా దేశాలు కీలక ఖనిజాలు (Critical Minerals), రేర్ ఎర్త్స్ సరఫరాల భద్రత కోసం వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ ఒప్పంద ఫ్రేమ్‌వర్క్‌పై సంతకాలు చేశారు.
వివరాలు
సెమీకండక్టర్లు, ఈవీలకు బలం
సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ, రక్షణ సాంకేతిక రంగాలకు అవసరమైన కీలక వనరుల సరఫరా గొలుసును బలోపేతం చేయడమే ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ముఖ్యంగా రేర్ ఎర్త్స్ ప్రాసెసింగ్, సరఫరాల్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అభివృద్ధి చేయడంపై భారత్, అమెరికా దృష్టి పెట్టాయి.
వివరాలు
పూర్తి సరఫరా వ్యవస్థలో సహకారం
ఒప్పందంపై సంతకాల అనంతరం జైశంకర్ మాట్లాడుతూ.. "కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్స్ తవ్వకం నుంచి ప్రాసెసింగ్, రీసైక్లింగ్ వరకు మొత్తం సరఫరా వ్యవస్థలో భారత్-అమెరికా సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడుతుంది" అన్నారు. పెట్టుబడులు, ఫైనాన్సింగ్, సమర్థవంతమైన నిర్వహణ వంటి అంశాల్లో కూడా కలిసి పనిచేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంత బలంగా ఉందో ఈ ఒప్పందం మరోసారి నిరూపించిందని జైశంకర్ పేర్కొన్నారు.
వివరాలు
అమెరికా వ్యాఖ్యలు
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో మాట్లాడుతూ.. "భారత్, అమెరికా రెండూ దీర్ఘకాలికంగా కీలక ఖనిజాల సరఫరా భద్రతను కోరుకుంటున్నాయి. ఇన్నోవేషన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ఇవి అత్యంత కీలకం" అన్నారు. ఈ ఒప్పందానికి పునాది ఫిబ్రవరి 4న వాషింగ్టన్ డీసీలో జరిగిన క్రిటికల్ మినరల్స్ ఫోరమ్‌లో పడిందని తెలిపారు. తర్వాత భారత్ 'పాక్సిల్లా' ఒప్పందంలో చేరడంతో దీనికి మరింత వేగం వచ్చిందన్నారు. ఒక్క దేశం ఆధిపత్యంలో ఉండే సరఫరా వ్యవస్థలపై ఆధారపడటం భవిష్యత్తులో జాతీయ ప్రయోజనాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని రుబియో హెచ్చరించారు. ఈ ఒప్పందం భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు.