LOADING...
Quarx Technosoft: విశాఖలో మరో ఐటీ క్యాంపస్.. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

Quarx Technosoft: విశాఖలో మరో ఐటీ క్యాంపస్.. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. విశాఖపట్టణంలోని కాపులుప్పాడ ప్రాంతంలో కొత్త ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.115 కోట్ల పెట్టుబడితో ప్రముఖ ఐటీ సంస్థ క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ క్యాంపస్‌ను నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మొత్తం 4 ఎకరాల భూమిని, ప్రతి ఎకరానికి రూ.1 కోటి చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

మొత్తం ప్రాజెక్టును ఐదేళ్లలోగా పూర్తి చేయాలని పేర్కొన్న ప్రభుత్వం 

ఈ క్యాంపస్‌లో అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక విభాగాలను అభివృద్ధి చేయనున్నారు. అలాగే, ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 కింద కంపెనీకి అవసరమైన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందించనుంది. ప్రాజెక్టు నిర్మాణం,నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒప్పందం కుదిరిన తేదీ నుంచి రెండు సంవత్సరాల లోపు తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించాలి, అలాగే మొత్తం ప్రాజెక్టు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయాలి అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వివరాలు 

విశాఖపట్నం ఐటీ రంగంలో మరింత వృద్ధి

ఈ ప్రాజెక్టు అమలులో ఏపీటీఎస్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ నిర్ణయం వల్ల విశాఖపట్నం ఐటీ రంగంలో మరింత వృద్ధి సాధించి, ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లే దిశగా మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.