Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో అలహాబాద్ హైకోర్టు కొనసాగిస్తున్న విచారణను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తుతం ఎలాంటి నివేదికను అలహాబాద్ హైకోర్టుకు సమర్పించకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం సోమవారం రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 20న చేపట్టాల్సి ఉంది.
వివరాలు
బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేశ్ శిశిర్ చేసిన ఫిర్యాదుతో..
అయితే సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో హైకోర్టు విచారణ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిచిపోనుంది.
సీబీఐ, ఈడీతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు కూడా హైకోర్టుకు నివేదికలు సమర్పించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేశ్ శిశిర్ చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.
రాహుల్ గాంధీ తనకు తెలిసిన ఆదాయ వనరులతో పోలిస్తే అధికంగా ఆస్తులు కలిగి ఉన్నారని ఆయన ఆరోపించారు.
ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
వివరాలు
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాహుల్
ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు.. రాహుల్ గాంధీపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలను సీబీఐ,ఈడీ పరిశీలించాలని గతంలో సూచించింది.
దర్యాప్తు పురోగతిపై సీబీఐ నుంచి నివేదిక కూడా కోరింది. జులైలో జరిగిన విచారణ అనంతరం కేసును ఆగస్టు 20కి జాబితా చేసింది.
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
హైకోర్టులో కొనసాగుతున్న ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణను అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మరో ప్రత్యేక పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు.
తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టు విచారణను నిలిపివేయడంతో పాటు సీబీఐ,ఈడీ నివేదికల సమర్పణపైనా ఆంక్షలు విధించింది.