Rahul Gandhi: హిమంత శర్మ.. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు: రాహుల్ గాంధీ ఫైర్
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఉదయం అసోంలోని బారాపేటలో జరిగిన భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ మాట్లాడారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నియంత్రణలో హిమంత బిస్వా శర్మ పని చేస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ షా చెప్పిందే.. అసోం సీఎం చేస్తున్నారని మండిపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మంగళవారం గువాహటిలో కాంగ్రెస్ కార్యకర్తలు- పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అసోం సీఎం శర్మ వెల్లడించారు.
ఇష్టమైన కేసులు పెట్టుకోండి.. నేను భయపడను: రాహుల్ గాంధీ
తనపై నమోదైన కేసుపై కూడా ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ నాయకులు తనపై ఎన్ని కేసులు కావాలంటే అన్ని పెట్టుకోవాలని రాహుల్ సూచించారు. కేసులకు తాను కేసులకు భయపడేది లేదన్నారు. అలాగే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కానీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు కూడా భయపడేది లేదన్నారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఒక మతానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని ఆరోపించారు. వారు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని, తాము ప్రేమను వ్యాప్తి చేస్తున్నామన్నారు. ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించుకోవచ్చని రాహుల్ హితవు పలికారు. ద్వేషం వెనుక భయం దాగి ఉందని బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు.